సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి ఆభరణాలు సురక్షితమని, అన్నీ ఆగమశాస్త్రం ప్రకారమే చేపడుతున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు తన వాదనను మళ్లీ వినిపించారు. తాను చేసిన ఆరోపణలకు, విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటించారు. వాటిపై సీబీఐతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. అలాగే మరోసారి కొన్ని విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీటీడీ అధికారులు, ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన ప్రశ్నించారు.
కేవలం నాలుగు బండలను తొలగించడానికి 22 రోజులపాటు పోటును ఎందుకు మూసివేశారో చెప్పాలని నిలదీశారు. స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు తయారు చేసే పోటును మూసివేయడం అపచారమన్నారు. తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని, ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం అన్నారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదని, కేవలం తయారు చేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ స్వామివారిని పస్తులుంచడం ఘోరమని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, రాళ్లు తొలగించాల్సిన అవసరమేముందని, వాటి కింద ఏమున్నాయని ఈ అపచారానికి పాల్పడ్డారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు శ్రేయస్కరమంటూ నిలదీశారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మతులు చేయడం ఎందుకోసం అని ప్రశ్నించారు. నేలమాళిగల కోసం తవ్వారా? అన్నదానికి సమా«ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు.
గులాబీ రంగు వజ్రం ఏమైంది..?
గులాబీ రంగు వజ్రం దేశం దాటిపోయిందన్న తన ఆరోపణకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు చెప్పారు. ఇటీవల జెనీవాలో వేలానికి వచ్చిన గులాబీ రంగు వజ్రం, శ్రీవారి ఆలయంలో భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిందని చెబుతున్న వజ్రం ఒకటేనన్నారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు ఎందుకు వాడటంలేదని నిలదీశారు. కొత్త నగలు మాత్రమే వాడడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ కింద అర్చకులు జీతగాళ్లుకాదన్నారు. కేవలం సంభావన కింద మాత్రమే పనిచేస్తున్నామని తెలిపారు. శిల్ప సంపదతో కూడిన వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించ వద్దని చెప్పినా వినిపించుకోలేదని పేర్కొన్నారు. రథ మండపాన్ని కూడా తీసేసి అపచారం చేశారన్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్నందుకే తనను ప్రధాన అర్చక హోదా నుంచి తొలగించారన్నారు. నేను తప్పులు చేస్తే శిక్షించండి... కానీ శ్రీవారి ఆస్తులను మాత్రం కాపాడండి.. అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment