సాక్షి, తిరుపతి: తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మళ్లీ విధులకు హాజరవుతారా.. హైకోర్టు గురువారం వెలువరించిన సంచలన తీర్పుతో సర్వత్రా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఆయన త్వరలోనే స్వామివారి సేవకు వస్తారనే ఆశావహ చర్చ జరుగుతోంది. తీర్పు అర్చకుల్లో ఆశలు నింపింది. 65 ఏళ్లు నిండాయంటూ రిటైర్మెంటు ప్రకటించడాన్ని తిరుచానూరు పద్మావతి ఆలయ అర్చకులు హైకోర్టులో సవాలు చేయడం.. వారికి సానుకూలంగా తీర్పు రావడం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో అందరి దృష్టీ రమణదీక్షితులపై మళ్లింది. త్వరలోనే తిరిగి స్వామి సేవలో కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లోని అర్చకులకు ఈ తీర్పు వర్తించే అవకాశముందంటూ వారంతా సంతోషంగా ఉన్నారు. టీటీడీ బోర్డు రిటైర్మెంటువిషయంపై తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఆది నుంచీ వివాదస్పదమైంది. అందువల్లే ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారనే రమణదీక్షితులను వయోపరిమితి సాకుతో రాత్రికి రాత్రే తొలగించారు. ఒక్కరినే తొలగిస్తే విమర్శలు వస్తాయని మరి కొంతమందిపై టీటీడీ రిటైర్‌మెంట్ అస్త్రం ప్రయోగించింది. దీంతో అర్చకులంతా ఏకమయ్యారు. రమణదీక్షితులు అత్యున్నత న్యాయస్థానాన్నే ఆశ్రయించారు.
రాజకీయ కోణంలోనే దీక్షితులపై వేటు
రమణదీక్షితులను రాజకీయ కోణంలోనే వేటు వేశారనే విమర్శలున్నాయి. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగటం లేదని, పోటులో తవ్వకాలు జరిపారని, ఆభరణాలు మాయమయ్యాయని ఆయన చెన్నై వేదికగా చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పిం చాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే ముద్ర వేసినట్లు తెలిసింది. అందువల్లే తిరుమలకు దీక్షితులను దూరం చేయాలని అధికారపార్టీ పెద్దలు గత జీఓను తెరపైకి తీసుకొచ్చారు. జీఓలో చూపిస్తూ రిటైర్మెంటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. టీటీడీ పాలకమండలి ఏకపక్ష నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని ప్రచారం జరిగింది. వయో పరిమితి అంశం టీటీడీకి సంబంధించినది కాకపోవటంతో హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో మిరాశీ వ్యవస్తను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై అర్చకులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మీరాశీ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే న్యాయస్థానం అప్పట్లో రద్దుచేసింది. వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయలేదు. ప్రస్తుత టీటీడీ పాలకమండలి నిర్ణయాన్ని తాజాగా హైకోర్టు తీర్పు తప్పు పట్టింది. తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు టీటీడీ సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఏమైనప్పటికీ హైకోర్టు తీర్పుతో రమణదీక్షితులతో పాటు రిటైర్‌మెంట్ పేరుతో వెళ్లిపోయిన అర్చకులందరూ తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment