సాక్షి ప్రతినిధి, తిరుపతి / తిరుమల : టీటీడీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగిలిపోనుంది. అర్చకుల తొలగింపు, నియామకాల్లో చోటు చేసుకున్న రాజకీయాలు శ్రీవారి గర్భగుడి వరకు వెళ్లడం భక్తులను విస్మయానికి గురిచేసింది. టీటీడీ అధికారులు, ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తిచూపుతూ మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తోన్న ఆరోపణలకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులు, ఆలయ అర్చకులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావడం చూసి భక్తులు నివ్వెరపోయారు.
తిరుమలలో ఈ తరహా నిరసనలను ఎన్నడూ చూడలేదన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకే పరిమితమైన ఆందోళనలు, నిరసనలు తొలిసారి ఆలయ ప్రాంగణంలో జరగడం భక్తులను విస్మయానికి గురిచేశాయి. ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రమణ దీక్షితులేమన్నా రాజకీయ నాయకుడా...? ఆయన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగులందరినీ వివాదంలోకి లాగడం ఎంత వరకూ సబబన్న ప్రశ్న తలెత్తుతోంది.
శ్రీవారి గర్భగుడిలోనూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆలయ ప్రతిష్టను దిగజార్చవద్దంటూనే అధికార పార్టీ పెద్దలు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి లొంగిన టీటీడీ అధికారులు చెప్పడంతో ఇష్టంలేకపోయినా నిరసనకు దిగినట్లు ఉద్యోగులు, అర్చకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలే సూత్రధారులా?
ఉద్యోగులు, అర్చకులు నిరసనలకు దిగడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా తిరుమల కొండపై నిరసనలు, ఆందోళనలు నిషేధం. ఉద్యోగులుగానీ, అర్చకులుగానీ ఎవరూ తిరుమల క్షేత్రంపై నిరసనలు జరిపిన సందర్భాలు లేవు.
అలాంటిది తాజాగా టీటీడీ ఉద్యోగులు జేబులకు, అర్చకులు ధోవతులకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్వామి వారి సేవా కైంకర్యాలకు హాజరయ్యే తమకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపడం ఇష్టం లేకపోయినా అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా తప్పడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని అర్చకులిద్దరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
నిరసన సరికాదన్న జేఈవో...
ఇదిలా ఉండగా తిరుమల క్షేత్రంలో నల్లబ్యాడ్జీలతో నిరసన సరికాదని తెలియజేస్తూ తిరుమల జేఈవో శ్రీనివాసరాజు గురువారం మధ్యాహ్నం తరువాత సర్క్యులర్ విడుదల చేశారు. ఉద్యోగులు, అర్చకులు ఈ తరహా నిరసనలకు దిగకూడదని అందులో స్పష్టం చేశారు.
రోజుకో ఘటనతో తిరుమల ప్రతిష్టకు భంగం
గత వారం రోజులుగా తిరుమలలో రోజుకో కొత్త సంఘటన చోటు చేసుకుంటోంది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ అధికారులపై ఆరోపణలు చేసిన «మరుసటి రోజే ధర్మకర్తల మండలి తిరుమలలో సమావేశమై 65 ఏళ్ల వయో పరిమితిని విధించడం అర్చకుల మధ్య రగడకు కారణమైంది. వారసత్వ అర్చకత్వాన్ని రద్దు చేసే అధికారం టీటీడీకి లేదని వాదిస్తూ రమణ దీక్షితులు తనదైన పోరాటాన్ని మొదలు పెట్టారు.
ఆయన వ్యవహార శైలిపై భగ్గుమన్న టీటీడీ అధికారులు ప్రధాన అర్చకత్వ బాధ్యతల నుంచి రమణ దీక్షితులును తొలగించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. టీటీడీ నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానన్న రమణదీక్షితులు ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అధికారులు చేసిన పనులను ఎత్తి చూపారు. ఆభరణాలు మాయమవుతున్నాయనీ, నేలమాళిగల్లోని అరుదైన సంపద కోసం పోటులో తవ్వకాలు జరిగాయన్న దీక్షితుల ఆరోపణలు టీటీడీ అధికారులను ఇరుకున పడేశాయి.
సీఎం దగ్గరకెళ్లిన టీటీడీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్, ఈవోలు సుధీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే రమణ దీక్షితులు చేస్తోన్న ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసేందుకు ప్రభుత్వం అటు అధికారులను, ఇటు అర్చకులనూ వాడుకుందన్న వాదనలు తెరమీదకు వచ్చాయి. ఎన్నడూ మీడియా ముందుకు రాని అనువంశిక అర్చకులు, జియ్యంగార్లు, పోటు కార్మికులు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చడమే ఇందుకు నిదర్శనం. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చోటచేసుకుంటున్న ఘటనలతో తిరుమల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో నిరసనలా..?
స్వామి దర్శనానికి చాలా సార్లు వచ్చాను. ఇలా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన మొట్టమొదటిసారి చూశాను. ఏది ఏమైనా స్వామి వారి సన్నిదానంలో ఈ తరహా నిరసనలు సమంజసం కాదు కదా... – సినీనటి కవిత.
ఖండించాల్సిన అంశం...
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో నిరసనలు ఉండకూడదు. అందరం ఖండించాల్సిందే. ఇలాంటి వాటిని ప్రభుత్వం నిలిపివేయాలి. టీటీడీ అధికారులే ఇలాంటివి ప్రోత్సహించడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం. ప్రభుత్వం జోక్యం చేసుకుని తిరుమలలో పెరుగుతున్న వివాదాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉంది. – భానుప్రకాశరెడ్డి, బీజేపీ నేత
Comments
Please login to add a commentAdd a comment