సాక్షి, తిరుమల : గతకొన్ని రోజులుగా రమణ దీక్షితులు టీటీడీ పాలక మండలిపై ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించిన అధికారులు.. రమణ దీక్షితులను ఆగమ సలహా మండలి సభ్యుడిగా తొలగించాలని తీర్మానించారు. ఈ సమావేశంలోనే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.
వాటిలో కొన్ని.. రమణ దీక్షితులు స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియామకం, మీరాశి వంశీకుల నుంచి అర్హత కలిగిన 12మంది అర్చకులను నియమించడం, తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 15కోట్లు, గోవిందరాజు స్వామి ఆలయం గోపురం బంగారు తాపడానికి 32కోట్లు, ఒంటి మిట్టలోని కోదండ స్వామి ఆలయ అభివృద్ది పనులకు రూ.36కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దివ్య దర్శనం కోసం రూ. 1.25కోట్లు, ప్రకాశం జిల్లా దుడ్డుకురు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్దరణకు 25లక్షలు, అనంతపురం జిల్లా పరిగి మండలం మోద గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 75లక్షలు, రోద్దకంబ ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్‌కు రూ. 75లక్షలు, తిరుమలలో యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి రూ.79కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఈవో సింఘాల్ ప్రకటించారు.
చిల్లర నాణేల మార్పిడిపై ఆర్బీఐతో సంప్రదింపుల కోసం కమిటీని నియమించినట్లు తెలిపారు. రమణ దీక్షితులుకు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ రాలేదని తెలిపారు. నూతన కళ్యాణ మండపాల నిర్మాణంపై సబ్ కమిటీ నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment