ఎమ్మెల్యే కోన రఘుపతి (పాత చిత్రం)
సాక్షి, తిరుపతి : దేవాలయాలు, అర్చకులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన రమణ దీక్షితులుకు మద్దతుగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు. తిరుమలలో జరుగుతున్న తప్పుల వల్ల రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. 65 ఏళ్లుకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపి, ఆయనను తక్షణమే ప్రధానార్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు.
65 ఏళ్లు నిండాయని ఆయనను పక్కన పెట్టడం దురదృష్టకరమని తెలిపారు. ఆయన బాధను చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేక పక్క రాష్ట్రానకి వెళ్లి చెప్పుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. చంద్రబాబు దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తి, విజయవాడలో కూల్చిన దేవాలయాలను ఎక్కడ తిరిగి నిర్మించలేదని ఆరోపించారు. దేవతా సేవల వేళల్లో ఇష్టానుసారం మార్పులు చేయడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాస్త్ర వ్యతిరేక పనులే చేస్తున్నారని విమర్శించారు. మిరాశీ కుటుంబీకుడు ప్రశ్నించడం తప్పా, ఆస్తుల లెక్కలు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. 2017 డిసెంబర్‌లో వంటశాలను మూసివేసి తవ్వకాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ మిరాశీలను 65 ఏళ్లకే తొలగిస్తామనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మణులతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. గతంలో ఐవైఆర్ కృష్ణారావును అలానే అవమానించారు. ఇప్పుడు రమణదీక్షితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. సన్నిధి గొల్లలకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. దేవాలయాలన్నింటికి ధూప దీప నైవేద్యాలుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులిచ్చి సంస్కృతి, సాంప్రదాయాలను బ్రతికించారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అలానే హామీ ఇచ్చారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment