
టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు
సాక్షి, తిరుమల : ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే స్వామి వారి ఆభరణాలు ప్రదర్శిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. స్వామివారి ఆభరణాలు ఒక్కగ్రాము కూడా పక్కదారి పట్టలేదని తెలిపారు. వందల ఏళ్ల క్రితం నాటి ప్రాకారాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందునే మరమత్తులు చేపట్టామని పేర్కొన్నారు. పోటు మరమత్తుల్లో భాగంగా ఫైర్ బ్రిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు.
అపవాదు వేయడం మంచిది కాదు: టీటీడీ చైర్మన్
పోటులో తవ్వకాలు జరగడం అవాస్తమని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బొక్కసానికి సంబంధించి మూడు తాళాలు ఉంటాయని.. ఈ మూడు తాళాలు సంబంధిత మూడు విభాగాల వారి వద్ద ఉంటాయని తెలిపారు. సీక్రెట్ లాక్ వల్ల పూర్తి స్థాయి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఆభరణాలను రికార్డు ప్రకారమే పరిశీలించాం గానీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయలేదని ఆయన తెలిపారు. స్వామివారి ఆభరణాల్లోని రూబీ ఒకటి విరిగిపోయిందని.. దాని విలువ 50 రూపాయలుగా నమోదు చేసి ఉందని పేర్కొన్నారు. పూర్వకాలంలో స్టీల్ రాడ్స్ లేనందువల్లే ప్రాకారాలు బలహీన పడ్డాయని అందుకే మరమత్తులు చేపట్టామన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రమణ దీక్షితులు అపవాదు వేయడం మంచిది కాదని, ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment