
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తొలగింపు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు, బ్రాహ్మణ, అర్చక సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఎండగడుతున్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు. రమణ దీక్షితులు తొలగింపులో టీటీడీ చేసిన అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కాగా, టీటీడీలో పలు విలువైన ఆభరాణాలు, వజ్రం కనిపించడం లేదని, వంటశాలలో నిబంధనలకు విరుద్ధంగా రెండు వారాలపాటు తవ్వకాలు జరిపారని, స్వామివారి కైంకర్యాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పరిధికి మించి జోక్యం చేసుకుంటోందని రమణదీక్షితులు పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఆ వెంటనే టీటీడీ 65 ఏళ్ల నిబంధన తీసుకువచ్చి రమణ దీక్షితులును తొలగించింది. అయితే తిరుమలలో వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న తమను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఆయన వాదిస్తున్నారు. తాము టీటీడీ కింద ఉద్యోగులుగా పనిచేయడం లేదని, అలాంటప్పుడు ఎలా తొలిగిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు సైతం తీర్పును వెలువరించిందని ఆయన పేర్కొంటున్నారు.