సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తిరుమల పూర్వ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఆలయం ప్రవేశం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ.. రమణ దీక్షితులుకు ఆలయ ప్రవేశం కల్పించింది. ఆగమ సలహామండలి సభ్యుడితో పాటు, శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడానికి అనుమతిని ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఆయనకు మార్గం సుగమమైంది. మరోవైపు రమణదీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన ఆరాచకాలు, అవినీతిపై రమణదీక్షితులు బహిరంగ ఆరోపణలు చేయడంతో ఆయనను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని విమర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment