
రమణ దీక్షితులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఏడాది కాలంగా ధర్మకర్తల మండలి లేక అభివృద్ధి పనుల విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న టీటీడీలో బుధవారం కీలక నిర్ణయాలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్‌లో ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన బోర్డు సభ్యుల తొలి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించను న్నారు. 190కి పైగా అజెండా అంశాలపై చర్చించనున్నారు. అభివృద్ధి, నిధులకేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది.
తొలి సమావేశం....
సాధారణంగా నెలకోసారి ట్రస్ట్‌బోర్డు సమావేశం జరగాలి. చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్న ధర్మకర్తల మండలి పదవీ కాలం ఏడాది కిందట పూర్తయ్యింది. ఆ తరువాత ఇటీవలనే కొత్త బోర్డు ఏర్పాటైంది. బుధవారం తొలి సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో కీలక అంశాలకు ఈ సమావేశం వేదిక కానుంది. సభ్యులు తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి. ఇటీవల టీటీడీ అధికారులు రూ.1000 కోట్ల నిధులను ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్లు వేసి శ్రీవారి సొమ్ముకు భద్రత లేకుండా చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే అంశంపై బుధవారం నాటి బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. సభ్యులు ఆమోదిస్తేనే రూ.1000 కోట్ల డిపాజిట్లు ప్రయివేటు బ్యాంకులో ఉంటాయి.
లేకపోతే విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం రూ.10 కోట్ల టీటీడీ నిధులను తిరుపతి సుందరీకరణకు కేటాయించింది. దీనిపైనా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ మధ్యనే రూ.9 కోట్ల నిధులతో అవిలాల చెరువు అభివృద్ధి పనులు కూడా చేపట్టాలనుకున్నారు. దీనిపైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుమారు రూ.70 కోట్ల ఇంజినీరింగ్ పనులపై బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుని ఆమోదాన్ని వ్యక్తం చేయాల్సి ఉంది. వచ్చే బ్రహ్మోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు సంబంధించిన బడ్జెట్ కేటయింపులపైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. భక్తులకు వసతులు, టైం స్లాట్ దర్శనం, లడ్డూల తయారీ, శ్రీవారి సేవలకు వసతి, వైద్యం, ఇతరత్రా అంశాలకు నిధుల కేటాయింపు విషయంపై సభ్యులు చర్చించి ఆయా అంశాలకు ఆమోదం తెలపాల్సి ఉంది. ధర్మకర్తల మండలిలో అందరూ కొత్త వారే కావడం వల్ల అజెండాలోని అంశాలపై పెద్దగా చర్చ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో అధికారులు వ్యూహాత్మకంగా 190కి పైగా అంశాలను అజెండాలో పొందుపర్చడం విమర్శలకు తావిస్తోంది.
అలజడి రేపిన రమణ దీక్షితులు...
టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూనే ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి.