సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాష్త్రానికి విరుద్దమని పేర్కొన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం నాలుగు బండలను తొలగించడానికి 22రోజుల పాటు పోటును ఎందుకు మూసివేశారని నిలదీశారు. పోటులో స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు చేస్తారని వెల్లడించారు.
ఇటీవల ఆ పోటును మూసివేశారని, తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదని.. కేవలం తయారుచేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. స్వామివారిని పస్తులుంచడం సరికాదని, ఆగమ శాష్త్రాలకు విరుద్దం అని వ్యాఖ్యానించారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, రాళ్ళు తొలగించాల్సిన అవసరం ఏంటని.. వాటి కింద ఏమున్నాయని ప్రశ్నించారు. మరమ్మత్తుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు శ్రేయస్కరం అంటూ నిలదీశారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మత్తులు చేయడం ఎంతవరకూ సమంజసం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment