సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ నెల 18 నుంచి 31 వరకూ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, మీడియా, పెట్రోల్ బంకుల కార్యకలాపాలకు.. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ, ఇతర అత్యవసర విధులకు హాజరయ్యే ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. కర్ఫ్యూ, ఇతర నిబంధనలను అమలుచేయడంతోపాటు, పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లను ఆదేశించారు. ఆ నిబంధనలు..
► బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. లేనిపక్షంలో రూ.100 జరిమానా.
► మాస్క్‌లేని వారిని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లోకి అనుమతిస్తే యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమాన.
► నిబంధనలు అతిక్రమించినట్లయితే స్థానిక పరిస్థితులు, కరోనా వ్యాప్తి తీవ్రతను బట్టి ఒకట్రెండు రోజులు మూసివేత.
► పెళ్లిళ్లు, శుభకార్యాలు, సామాజిక కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలు బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, ఇన్‌డోర్‌లో అయితే 100 మందికి మించకూడదు. వారందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం నిబంధన పాటించాలి.
► సినిమా హాళ్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. సీటు విడిచి సీటులో ప్రేక్షకులు కూర్చోవాలి.
► ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు, వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలి. 8 దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో భక్తులు మాస్క్ ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలి.
► ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2004, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆళ్ల నాని
ఇక రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కోరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలును ఈనెల 18కు వాయిదా వేసిందన్నారు. పండగ సమయంలో పట్టణాల నుంచి పెద్దఎత్తున పల్లెలకు ప్రజలు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే మార్చినట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
18 నుంచి రాత్రి కర్ఫ్యూ
Published Wed, Jan 12 2022 4:13 AM | Last Updated on Wed, Jan 12 2022 4:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment