
అధికారులతో సమీక్షిస్తున్న ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి సెంట్రల్: పిల్లలకు సనాతన ధర్మంపై మక్కువ పెంచేందుకు ముఖ్యమైన ధార్మికాంశాలను వీడియోలుగా రూపొందించి టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలి అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. వాటిని ఎస్వీబీసీ చానల్‌లోనూ ప్రసారం చేయాలని ఆయన సూచించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలపై తిరుపతి పరిపాలన భవనంలో సోమవారం అధికారులతో ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ సనాతన ధర్మంలోని ప్రాథమికాంశాలతో నెల వ్యవధితో కూడిన కోర్సును రూపొందించాలని ఆదేశించారు. వేదాలు, పురాణాలు, ఆలయాల వైశిష్ట్యం, హైందవ ధర్మ పరిరక్షణకు పలువురు మహానుభావులు చేసిన కృషిని కోర్సుల్లో పొందుపరచాల్సిందిగా సూచించారు.
మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు మూడు దశల్లో అర్చక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వైజాగ్, రాజమండ్రి వంటి దూర ప్రాంతాల నుంచి తిరుపతికి రానవసరం లేకుండా ఆయా ప్రాంతాలకు సమీపంలోనే అర్చక శిక్షణ ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని ఈవో తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతికి సంబంధించి చిత్రాలతో కూడిన కథలను ముద్రిస్తే ఎక్కువ మందికి చేరుతాయన్నారు. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమయ్యపై ప్రతి నెలా ఒకటి చొప్పున వరుస కథనాలను ప్రచురించాలని సూచించారు. వచ్చే అన్నమయ్య జయంతి నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. దాససాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ముద్రించే పుస్తకాలను ఇంగ్లిష్‌లోనూ తర్జుమా చేయాలన్నారు.
శ్రీవాణి ట్రస్ట్,ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌లపై సమీక్ష
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి, ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌ల కార్యకలాపాలపైనా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షించారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య చికిత్సల వివరాలను ఆరా తీశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ సమావేశాల్లో టీటీడీ జేఈవో బసంత్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జీ రామచంద్రా రెడ్డి, ఎఫ్‌ఏసీఏవో బాలాజీ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సీఎంవో డాక్టర్ నాగేశ్వరరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment