
సీఎం ఉద్ధవ్ థాక్రేను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల/సాక్షి, అమరావతి: ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని, ఎస్వీబీసీ హిందీ చానల్‌కు సహకరిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. ముంబయిలో మంగళవారం రాత్రి టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్‌లతో పాటు వైవీ సుబ్బారెడ్డి సీఎం థాక్రేను కలిశారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలని సీఎంను టీటీడీ చైర్మన్ కోరగా, గత ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిశీలించాలని, అది అనువుగా లేదనుకుంటే ఇంకో చోట భూమి కేటాయిస్తామని థాక్రే చెప్పారు.
అలాగే త్వరలో ప్రారంభించనున్న ఎస్వీబీసీ హిందీ చానల్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందించి, శేషవస్త్రంతో సన్మానించారు. కాగా, ఇదే అంశంపై టీటీడీ చైర్మన్, ఏఈవో, ఎస్వీబీసీ సీఈవోలు ముంబై స్థానిక సలహామండలి సభ్యులతో కూడా సమావేశమయ్యారు. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముంబైలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment