తిరుమల: ‘తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆడిట్ చేసేవారు. ఇకపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)తో ఆడిటింగ్ చేయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది’ అని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అలాగే ఈనెల 19 నుంచి 27 వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుపతిలో ఆదివారం జరిగిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాలు..
► పారదర్శకత పెంచడంలో భాగంగా ఆగస్టులో బోర్డు సమావేశాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాం.
► పెరటాసి మాసం కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలో రోజుకు 3 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను 30 వరకు తాత్కాలికంగా నిలిపివేశాం. ఆన్‌లైన్ కోటా పెంచి రోజుకు 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేస్తున్నాం. నిధుల కోసమే టీటీడీ ఇలా చేస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదు.
► ఆన్‌లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే వారు టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకోవచ్చు.
► కరోనా వల్ల శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేయడంతో.. ఇప్పటికే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం.
దళారుల మాటలకు మోసపోవద్దు: టీటీడీ
తిరుమలలో ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు భక్తులను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ నిఘా, భద్రతా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో తిరుమలలో ప్రస్తుతం ఎలాంటి ఆర్జిత సేవా టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొంది. తిరుమలకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అయిన ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ లో మాత్రమే పొందే అవకాశముందని స్పష్టం చేసింది. ఆర్జిత సేవల పునరుద్ధరణ తర్వాత ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు లభించని భక్తులకు తిరుమలలో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందవచ్చని పేర్కొంది. భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment