స్వర్ణ రథోత్సవానికి హాజరైన అశేష భక్త జనం
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఆదివారం స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఊరేగింపు అశేష భక్తజన గోవింద నామస్మరణల మధ్య సాగింది.
ఈ స్వర్ణ రథం 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉంటుంది. ఈ తరహాలో రథం మన దేశంలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఈ రథాన్ని 74 కిలోల మేలిమి బంగారంతో 18 ఇంచుల మందంతో కూడిన 2,900 కిలోల రాగి పై 9 సార్లు తాపడం చేశారు. వెండి రథం కొయ్యకు సరికొత్త హంగులతోనే ఈ స్వర్ణ రథాన్ని తయారు చేశారు. రథం తయారికీ టీటీడీ రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 2013లో తొలిసారిగా ఊరేగించారు.
ఉదయం భక్తశిఖామణిపై శ్రీరామచంద్రుడు
రాత్రి గజరాజుపై రారాజు దర్శనం ఇవ్వగా ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు.
రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా మాడ వీధులలో భక్తులను కనువిందు చేశారు.
వాహన సేవల్లో పెద్దజీయంగార్, చిన్నజీయంగార్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి గరుడ వాహన సేవ భక్తుల సహకారంతో విజయవంతమైందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
సర్వ దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి లైన్ ఆల్వార్ ట్యాంక్ వద్దకు చేరుకుంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 81,318 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
38,464 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.2.94 కోట్లు వేశారు. టీటీడీలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన అనంతరం స్వామి వారిని సామాన్య భక్తులు ఈ సంఖ్యలో దర్శించుకోవడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment