
సాక్షి, తిరుమల: 2017–18 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.2,900 కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ రూ.2858 కోట్లుగా ఉంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ఈనెల 15 లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రస్తుతం టీటీడీకి ప్రజాప్రతినిధులతోకూడిన ట్రస్టుబోర్డు గానీ, సీనియర్ అధికారులతో కూడిన సాధికారిక మండలి కానీ లేకపోవడంతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సిద్ధం చేశారు. కాగా తిరుమల శ్రీవారి గోసంరక్షణ ట్రస్టుకు ముంబైకి చెందిన సాహూ అనే భక్తుడు రూ.11.11 కోట్లు విరాళం ఇచ్చాడు. దీన్ని డిసెంబర్ 26న ఇచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
2.73 కోట్ల మందికి శ్రీవారి దర్శనం: 2017 జనవరి 1నుంచి 2017 డిసెంబరు 31వ తేదీ వరకు మొత్తం 2.73 కోట్ల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 2016తో పోల్చితే (2.66 కోట్లు) భక్తుల సంఖ్య 2.7 శాతం పెరిగింది. హుండీ కానుకలు 2016లో 1,046.28 కోట్లు రాగా, 2017లో 995.89 కోట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment