
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చించి ధరలు నిర్ధారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఎన్‌ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిడేటెడ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్), నాన్ ఎన్‌ఏబీహెచ్‌లుగా విభజించి రేట్లు నిర్ణయించింది. రోగికి సంబంధించి అన్నీ కలిపే పై ధరలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కన్సల్టేషన్, నర్సింగ్ చార్జీలు, రూమ్ అద్దె, భోజనం, కోవిడ్ టెస్టింగ్, రక్తపరీక్షలు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ పరీక్షలు, పీపీఈ కిట్‌లు, మందులు, యూరినరీ ట్రాక్ట్ కేథటరైజేషన్ వంటివన్నీ ఇందులోనే ఉంటాయన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి కోవిడ్ రోగిని అడ్మిట్ చేసుకోవాల్సిందేనన్నారు. అడ్మిషన్ సమయంలో ముందస్తు సొమ్ము (అడ్వాన్స్)కు డిమాండ్ చేయకూడదన్నారు.
సీటీ స్కాన్‌కు రూ.3 వేలు
అలాగే సీటీ స్కాన్‌కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం పేర్కొంది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్ ఇంజక్షన్‌కు రూ.30 వేలు తీసుకోవచ్చు. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించారు. తక్షణమే ఈ రేట్లు అమల్లోకి వస్తాయని, జిల్లా కలెక్టర్లు నిరంతరం వీటిని పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.