విలేకరులతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ తదితరులు
తిరుపతి సెంట్రల్: రాష్ట్రంలో మత కలహాలను సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం తొత్తుగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని వేలెత్తి చూపడానికి ఏ కారణాలు లేకపోవడంతో కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేతిలో పత్రిక ఉందని తప్పుడు వార్తలను ప్రచురిస్తే ఉపేక్షించేది లేదని ఆంధ్రజ్యోతిని హెచ్చరించారు. టీటీడీపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడితే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ‘యేసయ్య‘ అనే పదమే లేదని స్పష్టం చేశారు. టీటీడీ క్యాలెండర్‌లో గానీ, వెబ్‌సైట్‌లో గానీ ఆ పదం ఉంటే చూపాలని సవాల్ విసిరారు.
సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరతాం
ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు అన్యమత ప్రచారం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కొండ మీద శిలువ ఉందంటూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేసిందన్నారు. విచారణలోదీని వెనుక ఉంది టీడీపీ సానుభూతిపరులేనని వెల్లడైందని గుర్తు చేశారు. బస్సు టిక్కెట్లపై కూడా ఇలాగే అసత్య ప్రచారం చేసిందని.. దీనిపై విచారణ చేయిస్తే అవి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించినవేనని తేలిందన్నారు. ఆన్‌లైన్ వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
టీటీడీ పంచాంగం మొదటి పేజీలో తెలుగులో ‘శ్రియై నమః’ అనే పదం కనిపిస్తుందని, ఇది గూగుల్ అనువాదంలో ‘శ్రీ యేసయ్య‘గా మార్పు చెంది ఉండవచ్చన్నారు. ఇది గూగుల్ తప్పే కానీ టీటీడీ పంచాంగంలో దొర్లిన తప్పు కాదన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి గూగుల్‌కు రిపోర్టు చేసి వివరణ కోరామని తెలిపారు. ఇప్పుడు ఆ పదం కనిపించడంలేదన్నారు. గూగుల్ తప్పులకు టీటీడీ ఎలా బాధ్యత వహిస్తుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, సీవీఎస్‌వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment