
సాక్షి, అనకాపల్లి: న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పేరిట చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఉత్తరాంధ్ర ప్రజలంతా శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
అనకాపల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు దుష్టచతుష్టయంతో కలిసి మూడు రాజధానులపై వాస్తవాలను అవాస్తవాలుగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతకుముందు ఆయన పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాజువాకలోని నడుపూరులో జగనన్న కాలని భూమిపూజలో పాల్గొన్నారు.
మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి, విశాఖ జిల్లాల పార్టీ అధ్యక్షులు కరణం ధర్మశ్రీ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ భీశెట్టి సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర్‌గణేష్, కన్నబాబురాజు, విశాఖ పశి్చమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్.సుధాకర్ పాల్గొన్నారు.