సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. 3,540 సచివాలయాల పరిధిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, గ్రామాల్లోనూ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 30 నుంచి 40 కేసులున్న సచివాలయాలు 40 మాత్రమే ఉన్నాయని, 50కి పైన కేసులున్నవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలకు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, వాటిని నాలుగు చికిత్సలుగా విభజించి చేర్చామని చెప్పారు.
టీచింగ్ ఆస్పత్రుల్లో చిన్నారులకు పడకల పెంపు
రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో చిన్నారులకు ఐసీయూ, ఆక్సిజన్ పడకలు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని సింఘాల్ తెలిపారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రుల్లోనూ వనరులను బట్టి బెడ్స్ పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16చోట్ల మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూములను గుర్తించామని చెప్పారు. ఈ ఆస్పత్రులు ఎలా ఉండాలో త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,17,97,000 డోసుల టీకా వేశామన్నారు. యాంపొటెరిసిన్ బి ఇంజెక్షన్లు 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయని, పొసకొనజోల్ ఇంజెక్షన్లు, మాత్రల నిల్వలు పెంచామని వివరించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.16 లక్షలకు పైగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేశామన్నారు.
కేసులు తగ్గుతున్నాయ్
Published Tue, Jun 15 2021 5:23 AM | Last Updated on Tue, Jun 15 2021 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment