సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించేలా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీనివల్ల చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిస్థాయిలో చికిత్సలు, ఇతర సేవలు అందాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయని ఇవికాకుండా క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. వీటితో పాటు గతంలోనే ప్రకటించిన విధంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ..
మరిన్ని సేవలకు గ్రీన్ సిగ్నల్
ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని సేవలందించేందుకు వీలుగా విశాఖ కేజీహెచ్‌లో కొత్త ఎంఆర్‌ఐ, కాకినాడ జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ, క్యాథ్‌ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్, పాడేరు, అరకు ఆస్పత్రుల్లో అనïస్థీషియా, ఆప్తాలమిక్, ఈఎన్‌టీ సేవలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.37.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
ఆరోగ్యశ్రీ యాప్.. పటిష్టంగా ఆరోగ్యమిత్ర
ఆరోగ్యశ్రీ సేవలు సమర్థంగా అందించేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో సందేహాల నివృత్తి ఏర్పాట్లు కూడా ఉండాలని స్పష్టం చేశారు. యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆరోగ్య మిత్రలకు సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.
ఆరోగ్య సేవలపై సచివాలయాల్లో హోర్డింగ్స్
ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఆస్పత్రులపై అందరికీ అవగాహన కల్పించేలా గ్రామ సచివాలయాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు పొందాలంటే ఎక్కడకు వెళ్లాలో సూచిస్తూ సమాచారం ఉండాలని, ఇందుకు విలేజ్ క్లినిక్ రిఫరల్ పాయింట్ కావాలని స్పష్టం చేశారు. విలేజ్ క్లినిక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంలు ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఆస్పత్రికి వెళ్లాలి? ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ లభిస్తాయన్నది రోగులకు స్పష్టంగా తెలియాలని, దీనిపై సరైన మార్గదర్శనం చేయాలన్నారు. 108లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలని, ఈ మేరకు 104ను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీలో రిఫరల్ అన్నది చాలా కీలకమైన అంశమని, ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అధికారులు దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
మంచి కండిషన్‌లో 108, 104 వాహనాలు..
108, 104 వాహనాలు అత్యంత సమర్థంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. రోగులకు వేగంగా సేవలు అందించడంలో వాహనాలే కీలకమని, జిల్లాను యూనిట్‌గా తీసుకుని వాహనాలు మంచి కండిషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదనంగా బఫర్ వెహికల్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఆరోగ్య ఆసరా ద్వారా రోగులకు డిశ్చార్జి అయిన రోజు నుంచే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అందించాలని పునరుద్ఘాటించారు.
ఫొటోలతో స్పష్టంగా వ్యత్యాసం
విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు–నేడు పనుల ప్రగతిని ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నాడు – నేడు ద్వారా చేపడుతున్న ఏ కార్యక్రమమైనా సరే గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలన్నారు. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో తెలియజేసేలా ఫొటోలు ఉండాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే సేవల పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇందులో సిబ్బంది పాత్ర కీలకమని, ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలను వారికి వివరించాలన్నారు. వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని అధికారులకు నిర్దేశం చేశారు.
విలేజ్ క్లినిక్స్
విలేజ్ క్లినిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేసి వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలని సూచించారు.
రక్తహీనత నివారణలో రాష్ట్రమే ఫస్ట్
రక్త హీనత నివారణకు ఆరు రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలియచేశారు. రక్త హీనత నివారణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలిచినట్లు వెల్లడించారు. దేశవ్యాప్త సగటు 40.5 శాతం కాగా 75.3 పాయింట్లతో ఇండెక్స్‌లో ఏపీ ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు 58 పాయింట్లు వచ్చినట్లు వివరించారు. అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్ ద్వారా రక్తహీనత నివారణ కార్యక్రమాలు చురుగ్గా సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీ వార్మింగ్‌కు వినియోగించే మందులు కచ్చితంగా జీఎంపీ ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు.
జనవరిలోగా డబుల్ డోసులు పూర్తవ్వాలి..
కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని నిర్దేశిత వయసు వారందరికీ జనవరిలోగా డబుల్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం జగన్ సూచించారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడమే కోవిడ్ నివారణకు ఉన్న పరిష్కారమని స్పష్టం చేశారు.
హాజరైన మంత్రి, ఉన్నతాధికారులు..
సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజ్‌మెంట్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇన్‌చార్జ్ ఎ.బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్ నవీన్‌కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆ మాటే వినిపించకూడదు..
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు వివరించారు. ప్రతి ఆస్పత్రిలో పడకలు, వైద్యులు సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు ప్రదర్శించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సిబ్బంది లేకపోవడం వల్ల సేవలు అందలేదన్న మాటే వినిపించకూడదన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు తగినంత మంది సిబ్బంది ఉండాలని, ఇవి రెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
వారంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్
► ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చరికలతో ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఆంక్షలు
► మరో వారం రోజుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు
► ప్రస్తుతం కొనసాగుతున్న 32వ దఫా ఫీవర్ సర్వే
► రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ యాక్టివ్ కేసులు 1,912
► రికవరీ రేటు 99.21 శాతం
► రోజూ పాజిటివిటీ రేటు 0.52 శాతం
► 104 కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్ 718
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో 109 ప్రాంత్లాలో 144 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ఇప్పటివరకు 121 ప్లాంట్ల పూర్తి. ఈ నెలాఖరు నాటికి అన్నిచోట్లా ప్లాంట్లు అందుబాటులోకి.
► 69 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు. ఇప్పటికే 43 ఆస్పత్రుల్లో సిద్ధం.
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు 23,457. డీ టైప్ ఆక్సిజన్ సిలిండర్లు 27,311
Comments
Please login to add a commentAdd a comment