వైఎస్‌ జగన్‌: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌ | YS Jagan Orders Officials to Keep a Delp Desk in Hospitals Which are Eligible for Aarogyasri Scheme - Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌ 

Published Sat, Sep 5 2020 3:40 AM | Last Updated on Sat, Sep 5 2020 11:48 AM

CM Jagan Review Meeting Over Coronavirus preventive measures - Sakshi

కోవిడ్‌ ఆస్పత్రులపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో.. అదే రీతిలో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై సమీక్ష చేయాలి. వచ్చే సమావేశం నాటికి ఇందుకు సంబంధించిన పురోగతి వివరించాలి. 

కోవిడ్‌ టెస్టుల కోసం రూ.4.3 కోట్లు, ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందుల కోసం రూ.4.57 కోట్లు.. మొత్తంగా ప్రతి రోజూ రూ.10.18 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పరిస్థితిలో కోవిడ్‌ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్‌ చేయాలన్న దానిపై ప్రచారం ఉధృతం చేయాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్య మిత్రలతో ఆ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌–19 పరిస్థితులపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..  
కోవిడ్‌ –19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఆరోగ్య మిత్రలకు అవగాహన
► ఆరోగ్య మిత్రలకు ప్రొటోకాల్‌పై సంపూర్ణ అవగాహన ఉండాలి. ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా ఇస్తున్నారా? లేదా? అన్నది కూడా వారు చూడాలి. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని అందించాలి. 

► రోగులు సంతృప్తి చెందేలా ఆరోగ్య మిత్రలు సేవలు అందించేలా చూడాలి. ఒక ఆస్పత్రిలో రోగులకు వైద్యం సరిగా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్య మిత్రలదే.  

► ఆరోగ్యశ్రీ అమలుపై ఎప్పటికప్పుడు నిశిత పర్యవేక్షణ చేయాలి. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలి. రిఫరల్‌ విధానం సమర్థవంతంగా ఉండాలి. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల మీద, వైద్య సేవల నాణ్యత మీద ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. 

మాక్‌ కాల్స్‌తో పనితీరు పరిశీలన
► కాల్‌ సెంటర్లకు అధికారులు రోజూ మాక్‌ కాల్‌ చేసి, వాటి పని తీరును పరిశీలించాలి. ప్రతి మాక్‌కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలి.

► ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు.. ఈ నాలుగింటిపై ప్రశ్నలు వేసి.. అన్ని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో రోగుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. వీటి ద్వారా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలి. ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే వెంటనే పరిస్థితులను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి.  

► ఆరోగ్య ఆసరా మీద కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. మనం తీసుకుంటున్న చర్యలపై రోగులంతా సంతృప్తి వ్యక్తం చేయాలి. 
  
టీచింగ్‌ ఆస్పత్రులు 
► రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయి. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణంపైనా చర్యలు తీసుకోవాలి. (అక్టోబర్‌ నాటికి టెండర్ల ప్రక్రియ ముగిస్తామని అధికారులు చెప్పారు.) 

► సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్లు.. వాస్తవాలు
► కోవిడ్‌ ఆస్పత్రుల్లో మొత్తం 37,441 బెడ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం (శుక్రవారం నాటికి) సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్నవి 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఖాళీగా ఉన్నాయి. (కొన్ని పత్రికలు విషపూరిత రాతలు రాస్తున్నాయనే చర్చ వచ్చింది.) 

► మొత్తం 30,887 పోస్టులకు గాను 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ.  

► రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులు భర్తీ. అందులో 4,676 పోస్టులలో నియామకం, 5,295 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ. 10 రోజుల్లో పూర్తి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement