రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు | CM Jagan attend video conference with PM Modi On Covid situation | Sakshi
Sakshi News home page

రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు

Published Thu, Apr 28 2022 3:28 AM | Last Updated on Thu, Apr 28 2022 1:14 PM

CM Jagan attend video conference with PM Modi On Covid situation - Sakshi

సాక్షి, అమరావతి: రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి ఎక్కడా పునరావృతం కాకూడదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని ఆదేశించారు. కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం సీఎం జగన్‌.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల తిరుపతి రుయా, విజయవాడ ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిర్యాదు నంబర్లు స్పష్టంగా కనిపించాలి
► ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల కియోస్క్‌ల వద్ద ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు అన్నీ స్పష్టంగా డిస్‌ప్లే చేయాలి. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ లాంటి వాహనాల మీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలి. ఎవరికైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
► ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. ఇకపై ఆ పరిస్థితి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్‌ ఉండాలి. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన  చర్యలు తీసుకోవాలి. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలి.
► అలసత్వం వహించారనే కారణంతోనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్ని వేళలా మంచి చేయాలి. ఇందు కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు కట్టుదిట్టంగా అమలు కావాలి. విద్య, వైద్యం–ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి.

ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే. 
► ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం స్పెషల్‌ సీఎస్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement