శ్రీవారి ఆభరణాల్లో పింక్ డైమండ్ ఉన్నట్లు తెలియజేస్తోన్న అప్పటి సీవీఎస్‌వో రమణకుమార్ నివేదిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో అందిన ఆభరణాల్లో రూ.వందల కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ ఉన్నట్లు విజిలెన్సు రికార్డులు చెబుతున్నాయి. 2008 జూలై 28న అప్పటి టీటీడీ చీఫ్ విజిలెన్సు అధికారి రమణకుమార్ బంగారు డాలర్ల గల్లంతుపై విచారణ జరిపి ఈవోకి అందజేసిన నివేదికలో దీని గురించి ప్రస్తావించారు. ఈ భారీ వజ్రం ముక్కలై ఉన్నట్లు ఆయన తన నివేదికలో పొందుపరిచారు. దీన్నిబట్టి చూస్తే మంగళవారం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్‌లు స్వామి వారి ఆభరణాల్లో అసలు వజ్రమే లేదని చెప్పిన మాటలు అబద్ధమని స్పష్టమవుతోంది.సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం వారు ఈ వ్యాఖ్యలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీవారికి ఉన్న భారీ వజ్రం ఒకటి దేశం దాటి పోయిందనీ, ఇటీవలే అది జెనీవాలో వేలానికి వచ్చిందని ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు డిసెంబరు 8న శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయనీ, నిధుల కోసమే ఇవి జరిగినట్లు దీక్షితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి తిరుమల ఆలయంలో గుట్టుగా నిధుల వేట జరుగుతోందనీ, రూ.కోట్ల విలువైన ఆభరణాలకు భద్రత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
16వ శతాబ్దంలో ఒక వజ్రం..: ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 16వ శతాబ్దంలో శ్రీవారికి ఒక విలువైన వజ్రం ఉండేది. పోర్చుగీసు దేశం నుంచి వచ్చిన యాత్రికుడు జాక్వోస్ డీ కౌట్రే స్పానిష్ భాషలో రచించిన తిరుమల యాత్రా విశేషాల్లో ఈ వజ్రం గురించి వివరించాడని సుబ్రహ్మణ్యంరెడ్డి చెబుతున్నారు. కౌట్రే తిరుమల ఆలయాన్ని చూసి వేంకటేశ్వర స్వామి ప్రతిమకు విలువైన ఆభరణాలు అలంకరించబడి ఉండటం, అందులో విలువైన వజ్రం ఉన్న వడ్డాణాన్ని చూసినట్లు పేర్కొన్నారని ప్రొఫెసర్ వివరించారు.
నివేదికలో ఏముంది?
2008లో ఐదు గ్రాముల బరువున్న స్వామి వారి బంగారు డాలర్లు 300 పైగా గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో సీవీ ఎస్‌వోగా ఉన్న రమణకుమార్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి 2008 జూలై 28న ఈవోకి నివేదిక ఇచ్చారు. సదరు నివేదికలో గల్లంతైన డాలర్ల విలువ రూ.15.40 లక్షలుగా పేర్కొంటూ, కేసు వివరాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తన నివేదికలో పింక్ డైమండ్ గురించి పేర్కొన్నారు.
కొన్నేళ్ల కిందట వందల కోట్ల విలువ గల ఈ వజ్రం ముక్కలైనట్లు గుర్తించామని వివరించారు. దీన్నిబట్టి చూస్తే శ్రీవారి ఆభరణాల్లో విలువైన వజ్రం ఉన్నట్లు విశదమవుతోంది. దీనికి చైర్మన్, ఈవోలు ఏం సమాధానం చెబుతారోనన్నది ఉత్కంఠగా మారింది. 16వ శతాబ్దం నుంచి ఏఏ ఆభరణాలు స్వామివారికి కానుకలుగా అందాయో చెప్పడమే కాకుండా వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచాలనీ, అప్పుడే టీటీడీ అధికారుల పారదర్శకత స్పష్టమవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment