అత్యవసర సేవలకు అవసరమైన పలు సదుపాయాలతో 108 వాహనం
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్.. కుయ్.. మంటూ అంబులెన్సులు నిరంతరాయంగా తిరుగుతున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న ఈ తరుణంలో బాధితులకు ఈ కుయ్..కుయ్ శబ్దం కొండంత భరోసానిస్తోంది. కాల్ అందుకున్న నిమిషాల్లో 108, లేదా 104 అంబులెన్స్ ప్రత్యక్షమౌతోంది. పైసా ఖర్చులేకుండా క్షణాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది ఒకేసారి 1,088 కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడం యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ప్రతిమండలంలోనూ 108 అంబులెన్సులు, 104 వాహనాలు అందుబాటులో ఉండడంతో మండలంలోని ఊళ్లన్నిటికీ ఉపయోగంగా ఉంది. ఉచితంగా లభిస్తున్న ఈ 104, 108 అంబులెన్సు సర్వీసు కోవిడ్ రోగులకు పెద్ద ఊరటనిస్తోంది.
గతంలో నిర్వహణా ఖర్చులు ఇవ్వక, రిపేర్లు జరక్క, డీజిల్‌కు దిక్కులేక, డ్రైవర్లకు జీతాల్లేక పూర్తిగా మూలన పడ్డ అంబులెన్స్ వ్యవస్థను జగన్ రాగానే సమూలంగా ప్రక్షాళన చేశారు. సమస్యలన్నీ తీర్చడంతో పాటు డ్రైవర్లకు జీతాలూ పెంచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇపుడు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ అంబులెన్సులే అపర సంజీవనిలా మారాయి. కరోనా రోగులను వేగంగా తరలిస్తూ సకాలంలో వైద్యం అందడానికి ఉపయోగపడుతున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 86,754 మంది రోగులను ఆస్పత్రులకు తరలించారంటే అంబులెన్సులెంతగా ఉపయోగపడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మారుమూల పల్లెలకు వెళ్లి రోగులకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందించేందుకు 104 వాహనాలు ఉపయోగపడుతున్నాయి.
ఇదీ లెక్క..
► మొత్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌ల్లో 15,242 మంది కోవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించారు. అలాగే, 71,512 మంది సాధారణ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు. అంటే మొత్తం 86,754 మంది రోగులను తరలించారన్నమాట. కోవిడ్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌లు 124 ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 6,640 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రులకు తరలించారు.
► ఈ అంబులెన్స్‌లు బిజీగా వున్న పరిస్థితుల్లో నాన్ కోవిడ్ పేషంట్లకు వినియోగించే 108 అంబులెన్స్‌లను కూడా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా 8,602 మంది కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చారు.
కరోనా తొలివేవ్‌లోనే అంబులెన్సుల కొనుగోలు
2020 మార్చి 10వ తేదీన తొలికరోనా కేసు నమోదైంది. అప్పటికి రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020 జులైలో కొత్తగా 108 అంబులెన్సులు 412 , 104 వాహనాలు 656 కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్సులు 748 వున్నాయి. ఇందులో 731 వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నాయి. హైకోర్టు, సచివాలయం, గవర్నర్ (వీఐపీ లొకేషన్స్)బంగళా వద్ద మొత్తం మూడు ఉన్నాయి. మరో 14 వాహనాలు బ్యాకప్..అంటే ఏవైనా మరమ్మతులకు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. గతేడాది ఈ వాహనాలు కొనుగోలు చేయకపోయినా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. ఇపుడు చాలా సమస్య ఎదుర్కోవలసి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ
కోవిడ్ పేషెంట్లకు వినియోగించిన అంబులెన్సులను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో హైపోక్లోరైట్ సొల్యూషన్‌తో శానిటైజ్ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ధ్రువీకరించిన తరువాతే వాటిని మళ్లీ సాధారణ పేషెంట్ల కోసం వినియోగిస్తున్నారు. అలాగే పేషెంట్‌కు వినియోగించిన పరికరాలను ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్‌తో శుభ్రపరుస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే ఎమర్జెన్సీ మెడికల్ టీంలకు, అంబులెన్స్ పైలెట్‌కు అవసరమైన శిక్షణ ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్‌ల్లో పూర్తిగా నింపిన రెండు ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్, డెఫ్రిబులేటర్‌లు అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లను కాపాడేందుకు వినియోగిస్తున్నారు.
104తో ఇంటి ముంగిటకే వైద్యం
గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా గత నెల (ఏప్రిల్) 1 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో 104 వాహనాల ద్వారా 6,64,108 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించింది. వీరిలో 6,30,513 మందికి అవసరమైన మందులు పంపిణీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆ గ్రామంలోనే వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అలాగే మంచానికే పరిమితమైన 77,396 మంది పేషంట్లకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి చికిత్స అందించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ పేషెంట్లకు ఇంటివద్దకే వెళ్లి మందులు ఇస్తున్నారు
అవసరమైతే మరిన్ని కోవిడ్‌కు
కోవిడ్ పేషెంట్ల రవాణా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. అవసరమైతే మరిన్ని పెంచుకోవాలని చెప్పాం. ఇవికూడా సరిపోకపోతే ప్రైవేటు అంబులెన్సులనైనా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. దేశంలోనే అంబులెన్సుల నిర్వహణలో మనం ముందంజలో ఉన్నాం.
–అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment