బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు చర్యలు  | AP Govt Measures to control black fungus | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు చర్యలు 

Published Thu, May 20 2021 4:01 AM | Last Updated on Thu, May 20 2021 7:25 AM

AP Govt Measures to control black fungus - Sakshi

సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. కేంద్రం ఈ జబ్బు నియంత్రణకు 1,650 వయల్స్‌ (ఇంజక్షన్లు) కేటాయించిందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడు కంపెనీల (మైలాన్, భారత్‌ సీరం, సన్‌ఫార్మా) నుంచి 15 వేల ఇంజక్షన్లు కొనుగోలు చేస్తోందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంజక్షన్లు రానున్నాయన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఒక్కో పేషెంటుకు 60 ఇంజక్షన్ల వరకు అవసరం అవుతాయని చెప్పారు. ఇది ఖరీదైన చికిత్స కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరోగ్యశ్రీలో చేర్చిందన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉండగా, కేంద్రం 625 టన్నులకు ఆమోదం తెలిపిందన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే ఆక్సిజన్‌ కోటా తగ్గనుందన్నారు.

గతంలో ప్రొడక్షన్‌ కెపాసిటీ నుంచే కాకుండా స్టోరేజీ నుంచి కూడా కలిపి మొత్తం 170 మెట్రిక్‌ టన్నులు తీసుకునే వాళ్లమని చెప్పారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోవడంతో ప్రొడక్షన్‌ కెపాసిటీ 130 మెట్రిక్‌ టన్నులు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇందువల్ల అంగూల్, రూర్కెలా ప్లాంట్ల కేటాయింపులు పెంచారన్నారు. ఈనెల 23వ తేదీలోగా మరో 4 క్రయోజనిక్‌ ట్యాంకర్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటి ద్వారా 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వస్తుందని చెప్పారు. 104 కాల్‌సెంటర్‌లో రిజిస్టర్‌ అయిన వైద్యుల సంఖ్య 4,293కు పెరిగిందని, వీరిలో 188 మంది స్పెషలిస్టులున్నారని తెలిపారు. బుధవారం 12,679 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులతో వైద్యులు మాట్లాడారని చెప్పారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను బలోపేతం చేయడం వల్ల 104కు వచ్చే ఫోన్‌కాల్స్‌ తగ్గుముఖం పట్టాయని, త్వరలోనే వైరస్‌ అదుపులోకి వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. బ్లాక్‌ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతిచెండటం వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ఉన్న కమిటీలు రోజూ సమావేశాలు నిర్వహించి.. ఫీవర్‌ సర్వే, హోం ఐసొలేషన్‌ కిట్‌ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. రేయింబవళ్లు పనిచేస్తున్న వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement