అందుబాటులో అరలక్ష బెడ్స్‌ | Half a lakh beds available In AP | Sakshi
Sakshi News home page

అందుబాటులో అరలక్ష బెడ్స్‌

Published Sun, Apr 25 2021 3:09 AM | Last Updated on Sun, Apr 25 2021 8:06 AM

Half a lakh beds available In AP - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది. ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కలిపి 50,751 పడకలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 24,548 పడకలు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 26,203 పడకలు ఉన్నాయి. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా అవసరమైన మేరకు పడకల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం నవంబర్‌ తర్వాత కేసులు తగ్గడంతో కోవిడ్‌ ఆస్పత్రులను నాన్‌ కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో మళ్లీ ఒక్కసారిగా కేసులు విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. శుక్రవారం నాటికి 218 ఆస్పత్రులను సిద్ధంగా ఉంచింది. ఈ ఆసుపత్రుల్లో 24,548 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులూ ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో విధిగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బాధితులకు కోవిడ్‌ వైద్యం అందించాల్సి ఉంటుంది.

సిద్ధంగా 3,462 ఐసీయూ పడకలు
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండేవారి చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,462 ఐసీయూ పడకలు సిద్ధం చేశారు. కేసులు ఎక్కువగా ఉన్న చిత్తూరు జిల్లాలో 430 ఐసీయూ బెడ్స్‌ సిద్ధంగా ఉంచారు. అవసరమైతే మరిన్ని పడకలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాధితులకు క్రిటికల్‌ కేర్‌ చికిత్స అందించేందుకు నిపుణులైన వైద్యులందరూ సిద్ధంగా ఉండాలని, వారికి అండగా నిలవాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. 


కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 26,203 పడకలు
హోం ఐసొలేషన్‌లో ఉండటానికి అవకాశం లేక.. స్వల్ప లక్షణాలు లేదా ఓ మోస్తరు లక్షణాలతో ఉన్న వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తారు. ఇలాంటి వారి కోసం తాజాగా 26,203 పడకలు రెడీ చేశారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5వేల పడకలు కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సిద్ధంగా ఉంచారు. ఈనెల 24 ఉదయం నాటికి కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 3,083 మంది పేషెంట్లు ఉన్నారు. ఇంకా 23,120 పడకలు మిగిలి ఉన్నాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 43 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిని ఇంకా పెంచుతామని, ఈ సెంటర్లలో మరిన్ని పడకలు అందుబాటులోకి వస్తాయని  వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

కేసుల సంఖ్యను బట్టి మరిన్ని ఆస్పత్రులు
అన్ని జిల్లాల్లో అవసరాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చాలని కలెక్టర్లను ఆదేశించాం. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లను పెంచుతాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 104కు కాల్‌ చేసి వైద్య సేవలు పొందే అవకాశం కల్పించాం. అక్కడ వైద్యులు 3 షిఫ్ట్‌లూ పనిచేస్తున్నారు.
–అనిల్‌కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement