తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించిన సీఎం వైఎస్ జగన్.. గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందించారు. అనంతరం సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు ఇచ్చి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్ఫణకు వెళ్తున్న సీఎం శ్రీ వైయస్.జగన్, పరివట్టం చుడుతున్న అర్చకులు
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు. అంతకు ముందు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి.
సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో.. టీటీడీ చరిత్రలో వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కినట్టయింది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment