సమ్మర్ హాలిడేస్: చౌకగా విదేశీయానం
సమ్మర్ హాలిడేస్: చౌకగా విదేశీయానం
Published Fri, Apr 14 2017 11:47 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM
ముంబై: వేసవి సెలవులు వచ్చేశాయి. ఎక్కడికైనా సరదాగా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, విదేశీ ప్రయాణానికి సిద్ధం కండి. ఎందుకంటే ఈ సమ్మర్ లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లడం చాలా చౌకగా మారిందట. లండన్, సింగపూర్, సిడ్ని, కౌలాలంపూర్ వంటి విదేశాలకు వెళ్లడానికి విమాన ఛార్జీలు కిందకి దిగొచ్చాయని వెళ్లడైంది. అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలు 28 శాతం వరకు పడిపోయాయని తెలిసింది. బ్రూసెల్స్ విమానయాన సంస్థ వంటి విదేశీ క్యారియర్స్ ఆగమనంతో 2016 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమానసంస్థల టిక్కెట్ ధరలు కిందకి దిగొచ్చాయని టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీ నుంచి లండన్ ప్రయాణం రూ.31,800కి దిగొచ్చిందని, గతేడాది ఇదే నెలలో టిక్కెట్ ధర రూ.39,497గా ఉందని తెలిసింది. అంటే గతేడాది కంటే 19 శాతం తగ్గిపోయింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి సింగపూర్ ప్రయాణ ఛార్జీలు కూడా 22 శాతం పడిపోయి, రూ.22,715గా నమోదైనట్టు కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. 2016 ఏప్రిల్ లో ఈ ధర 29,069 రూపాయలుగా ఉన్నట్టు తెలిసింది. తమ రిపోర్టు ప్రకారం ఈ సమ్మర్ లో విమాన టిక్కెట్ ఖర్చులు గతేడాది కంటే తగ్గినట్టు తెలిసిందని కాక్స్ అండ్ కింగ్స్ బిజినెస్ హెడ్ జాన్ నాయర్ చెప్పారు. అన్నింటి కంటే ముంబాయి-కౌలాలంపూర్ ధర దాదాపు 28 శాతం వరకు తగ్గిపోయి, 20,377 రూపాయలుగా ఉందని రిపోర్టు పేర్కొంది. విదేశీ ఎయిర్ లైన్స్ ఎంట్రీతో పాటు ఇంధన ధరలు దిగిరావడంతో విమానసంస్థలు ధరలు తగ్గించినట్టు రిపోర్టు వెల్లడించింది.
Advertisement
Advertisement