Ethiopian Airlines
-
ఎగరని విమానాలు చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ దగ్గరున్న వాటిలో దాదాపు 20 శాతం విమానాలు నిలిచిపోవడం ఇందుకు కారణం. దేశీయంగా మొత్తం 585 విమానాలతో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్737 మ్యాక్స్ రకం విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించింది. ఫలితంగా స్పైస్‌జెట్ తమ దగ్గరున్న ఈ తరహా 12 విమానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో.. దేశీయంగా ఎయిర్‌లైన్స్ ఇలా పక్కకు పెట్టిన విమానాల సంఖ్య 114కి చేరింది. ఇది మొత్తం విమానాల సంఖ్యలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. విమానాల కొరత కారణంగా స్పైస్‌జెట్ బుధవారం 14 ఫ్లయిట్స్‌ను రద్దు చేయగా గురువారం 32 సర్వీసుల దాకా రద్దు చేసి ఉంటుందని అంచనా. మిగతా విమానాలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకోవడంపై సంస్థలు కసరత్తు చేస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కష్టాల్లో ఎయిర్‌లైన్స్.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కూలిపోవడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిషేధం అమలవుతోంది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు ఈ రకం ఏరోప్లేన్స్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే, దీనికన్నా ముందే దేశీయంగా ఇండిగో, గోఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు ఇతరత్రా కారణాలతో చాలా విమానాలను పక్కన పెట్టాయి. ఆర్థిక సంక్షోభం మొదలుకుని సాంకేతిక సమస్యలు, పైలట్ల కొరత మొదలైనవి ఈ కారణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు లీజింగ్ సంస్థలకు చెల్లింపులు జరపకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి చెందిన 50 శాతం విమానాలు ఇప్పటికే నిల్చిపోయాయి. ఇక, పైలట్ల కొరత సమస్యతో ఇండిగో రోజుకు దాదాపు 30 ఫ్లయిట్ సర్వీసుల దాకా రద్దు చేస్తోంది. మరోవైపు 47 విమానాలు ఉన్న గోఎయిర్ సంస్థ ఇంజిన్ల సమస్యలు, సరైన నెట్వర్క్ లేకపోవడం తదితర అంశాల కారణంగా 14 విమానాలను పక్కన పెట్టింది. ఇలా ఒకవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్‌కి తగినంత స్థాయిలో సర్వీసులు నడిపేందుకు విమానాలు లేకపోతుండటం మూలంగా విమాన చార్జీలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే 15 శాతం పెరిగిన చార్జీలు.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విమానయాన చార్జీలు (వార్షిక ప్రాతిపదికన) 15 శాతం దాకా పెరిగాయని ఆన్లైన్ ట్రావెల్ సెర్చి ఇంజిన్ యాత్ర ఆన్లైన్ సీవోవో శరత్ ధాల్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం, విమానాల సంఖ్య తగ్గుతుండటం కారణంగా.. భారీ సంఖ్యలో ప్యాసింజర్స్‌కు తగ్గట్లుగా ఎయిర్‌లైన్స్ సర్వీసులు నడపలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో చార్జీలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నారు. ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటే ఏకంగా 100 శాతం పైగానే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ట్రావెల్ పోర్టల్ ప్రకారం.. బుధవారం ముంబై–చెన్నై రూట్లో స్పాట్ టికెట్ ధర ఏకంగా రూ. 26,073 పలికింది. గతేడాది ఇదే సమయంలో ఈ రేటు రూ. 5,369 మాత్రమే. హోలీ పండుగ, స్కూళ్లు .. కాలేజీలకు వేసవి సెలవులు వంటి అంశాలతో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ భారీగానే ఉంటుందని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్‌పాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ముందుగా బుక్ చేసుకోవడమే మంచిదని సూచించారు. ‘మ్యాక్స్’ సమస్యలు.. మ్యాక్స్ తరహా ఏరోప్లేన్స్ సంఖ్య ప్రస్తుతానికి తక్కువే ఉన్నా .. పలు సంస్థలు పెద్ద సంఖ్యలో వీటి కోసం ఆర్డర్ ఇచ్చాయి. నిషేధం కారణంగా ఆ విమానాల డెలివరీ ఆగిపోతే విమానాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) సీఈవో (దక్షిణాసియా విభాగం) కపిల్ కౌల్ చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ ఆర్థిక కష్టాలు, ఇండిగోలో పైలట్ల కొరత మొదలైనవి కూడా దీనికి తోడైతే విమానయాన సంస్థల సామర్థ్యం మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. మ్యాక్స్ విమానాలను పక్కన పెట్టాల్సి రావడం, నిషేధం ఎత్తివేతపై అనిశ్చితి నెలకొనడం.. స్పైస్‌జెట్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపనుంది. స్పైస్‌జెట్ ఏకంగా ఈ రకానికి చెందిన 155 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
నేలకు దిగిన బోయింగ్‌లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్‌లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
నా కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయా..
కుప్పకూలిన విమానం : హృదయ విదారక గాథలు ఇథియోపియా విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 157 ప్రయాణికులతో బయలు దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. న్యూఢిల్లీకి చెందిన శిఖాగార్గ్ (అటవీ మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్యసమితి డెవెలప్మెంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్) , కెనడా కుటుంబం కథ వింటే హృదయం ద్రవించకమానదు. ఏడడుగులు వేసి మూడు నెలలే...కలలన్నీ కల్లలై ఢిల్లీకి చెందిన శిఖాకు ఇటీవల పెళ్లైంది. అంటే మూడు నెలల క్రితమే ప్రేమికుడు సౌమ్య భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. మూడేళ్లకాలంలో చెప్పుకున్న ఊసులు, కన్న కలలునెరవేరకుండానే నవ వధువు శిఖా ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆమె భర్తను తీవ్రంగా కలిచి వేస్తోంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఫోన్ చేస్తానన్న భార్య మెసేజ్‌కు సమాధానం ఇచ్చేలోపే.. ఆమె తిరిగిరాని అనంత లోకాలకేగిపోయింది. అంతేకాదు నైరోబి నుంచి తిరిగి వచ్చిన తరువాత హనీమూన్‌కి వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకున్నారట. నిజానికి భర్త భట్టాచార్యకూడా నైరోబి వెళ్లాల్సి వుంది. భార్య శిఖాతో పాటు టికెట్‌ను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో అత్యవసర పని పడటంతో ప్రయాణాన్ని విరమించుకోవాల్సింది వచ్చింది. అదే ఆయన ప్రాణాలను నిలబెట్టింది.. కానీ తన ప్రాణానికి ప్రాణమైన సహచరిని శాశ్వతంగా దూరం చేసింది. కన్నవారికి కన్నభూమిని చూపించాలన్న ఆశ తీరనే లేదు కెనడాలోని సదరన్ ఒటారియా నగరం బ్రాంప్టన్‌కు చెందిన కుటుంబానిది మరో విషాద గాథ. ఒకే కుటుంబంలోని ఆరుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోషా వైద్య, ప్రేరిత్ దీక్షిత్ దంపతులు తమ గారాల కుమార్తెలు అనుష్క (13), ఆషా(14)లతో కలిసి కెన్యాకు విహార యాత్రకు బయలుదేరారు. ముఖ్యంగా పిల్లలకు మార్చి సెలవులు రావడంతో తన జన్మభూమిని, తను పుట్టిన ఆసుపత్రిని కన్నబిడ్డలకు చూపించాలని తల్లి కోషా వైద్య ఆశపడ్డారు. అక్కడినుంచి సఫారీకి పోవాలని, ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పిల్లలకు చూపించాలని, సరదాగా గడపాలని ఎన్నో కలలు కన్నారు. తమతోపాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లారామె. కానీ ఆ ఆశ తీరకుండానే మొత్తం ఆరుగురూ ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆప్తుల్ని కోల్పోయాను క్షణాల్లో అంతా శూన్యంగా మారిపోయిందని కోశ సోదరుడు మనంత్ వైద్య ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తులందర్నీ పోగొట్టుకున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆశా, అనుష్క చదువులలో సరస్వతులు అని వారి స్కూలు ప్రిన్సిపల్ చెప్పారు. అలాగే ఆశా మంచి గాయని అనీ, అనుష్క భారత శాస్త్రీయ నృత్యం అన్నా, కంప్యూటర్స్ అన్నా బాగా ఇష్టపడేదని గుర్తు చేసుకున్నారు. ఇది తమ పాఠశాల సిబ్బందినీ, ఇతర విద్యార్థులను తీవ్ర విచారంలో ముంచేసిందన్నారు. వీరి మృతికి సంతాపంగా బ్రాంప్టన్ నగరంలోని సిటీ హాల్లో పతాకాన్ని తదుపరి ఆదేశాల దాకా హాఫ్స్టాఫ్ గా ఉంచాలని అధికారులు ఆదేశించడం విశేషం. కాగా ఈ ప్రమాదంలో కీలక ఆధారమైన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు కొనుగొన్నారు. ఇందులో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డై ఉందని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతిందంటున్నఅధికారులు.. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. -
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
-
బోయింగ్‌కి చైనా షాక్
-
‘ఇథియోపియా’ బ్లాక్‌బాక్స్ దొరికింది
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్‌క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్‌పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. బోయింగ్‌కు చైనా షాక్! చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. -
ఇథియోపియాలో కూలిన విమానం
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే.. అడిస్ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎమర్జెన్సీ కాల్ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737–8 మ్యాక్స్ గత నవంబర్లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్ విచారం వ్యక్తం చేసింది. భారతీయ మృతుల గుర్తింపు.. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. గార్గ్ యూఎన్ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్ భాస్కర్, వైద్య హాసిన్ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ : దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం ఎడమవైపు రెక్క కొద్దిగా వంగిపోయింది. ఈ ఘటనపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విచారణకు ఆదేశించింది. కాగా, ఇలాంటి సంఘటనే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏప్రిల్‌లో జరిగింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఏఐ156), రాంచీ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో (6ఈ389) విమానాలు దాదాపు ఢీకొనబోయాయి. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు పైలట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించి భారీ ప్రమాదాన్ని నివారించగలిగారు.