కుప్పకూలిన విమానం : హృదయ విదారక గాథలు
ఇథియోపియా విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 157 ప్రయాణికులతో బయలు దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. న్యూఢిల్లీకి చెందిన శిఖాగార్గ్ (అటవీ మంత్రిత్వ శాఖ ఐక‍్యరాజ్యసమితి డెవెలప్‌మెంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్) , కెనడా కుటుంబం కథ వింటే హృదయం ద్రవించకమానదు.
ఏడడుగులు వేసి మూడు నెలలే...కలలన్నీ కల్లలై
ఢిల్లీకి చెందిన శిఖాకు ఇటీవల పెళ్లైంది. అంటే మూడు నెలల క్రితమే ప్రేమికుడు సౌమ్య భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. మూడేళ్లకాలంలో చెప్పుకున్న ఊసులు, కన్న కలలునెరవేరకుండానే నవ వధువు శిఖా ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆమె భర్తను తీవ్రంగా కలిచి వేస్తోంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఫోన్ చేస్తానన్న భార్య మెసేజ్‌కు సమాధానం ఇచ్చేలోపే.. ఆమె తిరిగిరాని అనంత లోకాలకేగిపోయింది. అంతేకాదు నైరోబి నుంచి తిరిగి వచ్చిన తరువాత హనీమూన్‌కి వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకున్నారట.
నిజానికి భర్త భట్టాచార్యకూడా నైరోబి వెళ్లాల్సి వుంది. భార్య శిఖాతో పాటు టికెట్‌ను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో అత్యవసర పని పడటంతో ప్రయాణాన్ని విరమించుకోవాల్సింది వచ్చింది. అదే ఆయన ప్రాణాలను నిలబెట్టింది.. కానీ తన ప్రాణానికి ప్రాణమైన సహచరిని శాశ్వతంగా దూరం చేసింది.
కన్నవారికి కన్నభూమిని చూపించాలన్న ఆశ తీరనే లేదు
కెనడాలోని సదరన్ ఒటారియా నగరం బ్రాంప్టన్‌కు చెందిన కుటుంబానిది మరో విషాద గాథ. ఒకే కుటుంబంలోని ఆరుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోషా వైద్య, ప్రేరిత్ దీక్షిత్ దంపతులు తమ గారాల కుమార్తెలు అనుష్క (13), ఆషా(14)లతో కలిసి కెన్యాకు విహార యాత్రకు బయలుదేరారు. ముఖ్యంగా పిల్లలకు మార్చి సెలవులు రావడంతో తన జన్మభూమిని, తను పుట్టిన ఆసుపత్రిని కన్నబిడ్డలకు చూపించాలని తల్లి కోషా వైద్య ఆశపడ్డారు. అక్కడినుంచి సఫారీకి పోవాలని, ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పిల్లలకు చూపించాలని, సరదాగా గడపాలని ఎన్నో కలలు కన్నారు. తమతోపాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లారామె. కానీ ఆ ఆశ తీరకుండానే మొత్తం ఆరుగురూ ఈ ప్రమాదంలో చనిపోయారు.
ఆప్తుల్ని కోల్పోయాను
క్షణాల్లో అంతా శూన్యంగా మారిపోయిందని కోశ సోదరుడు మనంత్ వైద్య ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తులందర్నీ పోగొట్టుకున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆశా, అనుష్క చదువులలో సరస్వతులు అని వారి స్కూలు ప్రిన్సిపల్ చెప్పారు. అలాగే ఆశా మంచి గాయని అనీ, అనుష్క భారత శాస్త్రీయ నృత్యం అన్నా, కంప్యూటర్స్ అన్నా బాగా ఇష్టపడేదని గుర్తు చేసుకున్నారు. ఇది తమ పాఠశాల సిబ్బందినీ, ఇతర విద్యార్థులను తీవ్ర విచారంలో ముంచేసిందన్నారు. వీరి మృతికి సంతాపంగా బ్రాంప్టన్ నగరంలోని సిటీ హాల్‌లో పతాకాన్ని తదుపరి ఆదేశాల దాకా హాఫ్‌స్టాఫ్ గా ఉంచాలని అధికారులు ఆదేశించడం విశేషం.
కాగా ఈ ప్రమాదంలో కీలక ఆధారమైన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు కొనుగొన్నారు. ఇందులో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డై ఉందని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతిందంటున్నఅధికారులు.. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment