
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్‌బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్‌బాక్స్‌లో విమాన సమాచారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్‌క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్‌పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి.
బోయింగ్‌కు చైనా షాక్!
చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు.