ఐటీ కంపెనీలకు ‘బ్లో’యింగ్‌ | Boeing to Suspend 737 MAX Production in January | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలకు ‘బ్లో’యింగ్‌

Published Sat, Dec 28 2019 4:16 AM | Last Updated on Sat, Dec 28 2019 4:19 AM

Boeing to Suspend 737 MAX Production in January - Sakshi

న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్‌ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండిపడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్‌ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్‌ సిరీస్‌ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, సైయంట్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ప్రస్తుతం బోయింగ్‌ సంస్థతో వ్యాపార అనుబంధం కలిగి ఉన్నాయి. ‘‘చాలా భారత ఐటీ కంపెనీలకు బోయింగ్‌ ప్రముఖ క్లయింట్‌గా ఉంది. కనుక స్వల్పకాలంలో ఈ కంపెనీలపై తప్పక ప్రభావం ఉంటుంది.

బోయింగ్‌ ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఏరోస్పేస్‌ విభాగంలో వ్యయాలు కూడా తగ్గిపోతాయి’’ అని ఐటీ అవుట్‌సోర్సింగ్‌ అడ్వైజర్, పారీక్‌ కన్సల్టింగ్‌ వ్యవస్థాపకుడు పారీక్‌ జైన్‌ తెలిపారు. మ్యాక్స్‌ 737 విమాన తయారీని ఈ నెలారంభంలోనే బోయింగ్‌ తాత్కాలికంగా నిలిపివేయగా, జనవరి నుంచి తన సరఫరాదారులు సరఫరాను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ తన సీఈవో డెన్నిస్‌ ములెన్‌బర్గ్‌కు ఈ వారమే ఉద్వాసన కూడా పలకడం గమనార్హం. ఇండోనేసియా, ఇథియోపియాల్లో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలిపోయిన ఘటనల నేపథ్యంలో నియంత్రణ సంస్థల విశ్వాసాన్ని బోయింగ్‌ కోల్పోయింది. ఇదే సీఈవోను సాగనంపేందుకు దారితీసింది.  

సగం వాటా మన ఐటీ కంపెనీలదే..
విమానయాన ఇంజనీరింగ్‌ అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. బోయింగ్, ఎయిర్‌బస్‌ సమానంగా వాటా కలిగి ఉన్నాయి. బోయింగ్‌ సంస్థ 2 బిలియన్‌ డాలర్ల విలువైన సేవలను అవుట్‌సోర్సింగ్‌ ఇస్తుండగా, ఇందులో సగానికి సగం మన దేశ ఐటీ కంపెనీలే సొంతం చేసుకుంటున్నాయి. వీటితోపాటు అస్సెంచుర్, క్యాప్‌జెమినీ సంస్థలు కూడా ఈ విభాగంలో ముందున్నాయి.

బోయింగ్‌కు ఇంజన్లను ప్రట్‌ అండ్‌ విట్నే, రోల్స్‌రాయిస్, జనరల్‌ ఎలక్ట్రిక్, శాఫ్రాన్‌.. విమాన విడిభాగాలను స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్‌ సమకూరుస్తున్నాయి. రాక్‌వెల్, హానీవెల్‌ సంస్థలు ఏవియోనిక్స్‌ను సమకూరుస్తున్నాయి. ‘‘చాలా వరకు భారత ఐటీ సంస్థలు నేరుగా బోయింగ్‌ సంస్థతో, సరఫరా వ్యవస్థతో అనుబంధం కలిగి ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, సైయింట్‌ నేరుగా బోయింగ్‌తో వ్యాపారం కలిగి ఉంటే, విడిభాగాల సరఫరాదారు స్పిరిట్‌ ఏరోసిస్టమ్‌ ఇన్ఫోసిస్‌ క్లయింట్‌గా ఉంది’’ అని అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌ ప్రముఖుడొకరు తెలిపారు.

ఒప్పందాల్లో రక్షణ ఉంటుంది..  
‘‘సాధారణంగా అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టుల్లో రక్షణకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. రద్దు కారణంగా తలెత్తే నష్టాల నుంచి ఐటీ కంపెనీలకు రక్షణ ఉంటుంది. అయితే, స్వల్ప కాలానికి లాభదాయకతపై కచ్చితంగా ప్రభావం పడుతుంది’’ అని గ్రేహౌండ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో సంచిత్‌విర్‌ గోగియా వివరించారు.  ‘‘ఇంజనీరింగ్‌ సేవల సంస్థలు మాత్రం ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నాయి. ఎందుకంటే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ను నిలిపివేస్తే, అప్పుడు 797 మోడల్‌పై అధిక వ్యయాలు చేస్తుందన్న అంచనాతో ఉన్నాయి. భారత ఇంజనీరింగ్‌ సేవల సంస్థలకు ఇది సానుకూలమే’’ అని మరొక నిపుణుడు పేర్కొన్నారు. బోయింగ్‌ 797  కొత్త తరహా విమానం. ఇది 225–275 సీట్ల సైజుతో ఉంటుంది.

బోయింగ్‌ సరఫరా వ్యవస్థ
ఇంజిన్‌ తయారీదారులు:  ప్రట్‌ అండ్‌ విట్నే, రోల్స్‌రాయిస్, జనరల్‌ ఎలక్ట్రిక్, శాఫ్రాన్‌
విడిభాగాల సరఫరాదారులు:  స్పిరిట్‌ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్‌ ఏవియోనిక్స్‌
(ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌): రాక్‌వెల్, హనీవెల్‌
భారత కంపెనీలు: భారత ఐటీ కంపెనీలు అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్, ఇంజనీరింగ్, ఏవియోనిక్స్, బీపీఓ సేవలను బోయింగ్‌ 737 మ్యాక్స్‌  విమాన తయారీ కార్యక్రమానికి అందిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement