నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్‌ | Boeing agreement MAX disasters that killed 346 people with Rs 2000 crs | Sakshi
Sakshi News home page

నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్‌

Published Tue, Jul 9 2024 9:47 AM | Last Updated on Wed, Jul 10 2024 4:43 PM

Boeing agreement MAX disasters that killed 346 people with Rs 2000 crs

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ ‘737 మ్యాక్స్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్పకూలిన విషయంలో నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు బాధితులకు జరిమానా కింద రూ.243.6 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.2 వేలకోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు అమెరికా న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా బోయింగ్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..‘2018-19 మధ్యకాలంలో ఇండోనేషియా, ఇథియోపియాలో 737 మ్యాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రెండు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లోని కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయి. అందుకు పరిహారంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలకోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అమెరికా న్యాయ సంస్థతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాం. దీనిపై న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది’ అని చెప్పారు.

ప్రమాదాలు జరిగిన వెంటనే బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. బోయింగ్‌ను చట్టపరంగా శిక్షించడంతోపాటు ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాంతో 2021లో కేసు పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.2,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు బోయింగ్‌ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించింది. దాంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల బోయింగ్‌ నేరాన్ని అంగీకరించడంతోపాటు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 వేలకోట్లు జరిమానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.

ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జరిమానాతోపాటు రక్షణ చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం రూ.3,700 కోట్లు బోయింగ్‌ వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్‌ బోర్డు కలవాలి. ఒప్పంద షరతులను బోయింగ్‌ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమించాలి.

ఇదీ చదవండి: ఆయుష్మాన్‌ భారత్‌ బీమా కవరేజీ పెంపు..?

ఇదిలాఉండగా, నేర అంగీకారం వల్ల అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్‌ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement