ముంబై, సాక్షి: బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులకు యూఎస్ వైమానిక నియంత్రణ సంస్థ తిరిగి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో స్పైస్‌జెట్ కౌంటర్‌కు జోష్ వచ్చింది. రెండు ఘోర ప్రమాదాల నేపథ్యంలో సుమారు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలను తిరిగి సర్వీసులకు వినియోగించేందుకు బుధవారం యూఎస్ ఎఫ్‌ఏఏ అనుమతించింది. 2019 మార్చి నుంచి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను సర్వీసుల నుంచి తప్పించిన విషయం విదితమే. అయితే నిలిచిపోయిన ఈ విమానాలను ఆధునీకరించాక మాత్రమే సర్వీసులను ప్రారంభించుకోవలసిందిగా యూఎస్ ఎఫ్‌ఏఏ ఆదేశించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్, వైరింగ్ సవరణలతోపాటు.. పైలట్లు సైతం తగినంత సన్నద్ధత కావలసి ఉంటుందని తెలియజేసింది.
షేరు జోరు
బోయింగ్ తయారీ 737 మ్యాక్స్ విమానాలను సర్వీసులకు తిరిగి అనుమతించిన వార్తలో స్పైస్‌జెట్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దేశీయంగా స్పైస్‌జెట్ మాత్రమే 13 ఎయిర్ క్రాఫ్ట్‌లను కలిగి ఉంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 15 శాతం దూసుకెళ్లి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. మ్యాక్స్ 737 విమానాల నిలిపివేత కారణంగా కంపెనీ వ్యయాలు పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. గత నాలుగు రోజులుగా స్పైస్‌జెట్ కౌంటర్ ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం. గత నాలుగు రోజుల్లో ఈ షేరు 40 శాతం దూసుకెళ్లడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment