ఒకరికి ఖేదం... వేరొకరికి మోదం అంటే ఇదేనేమో! హోటళ్ళు, రెస్టారెంట్లలో తప్పనిసరి సర్వీస్ ఛార్జ్‌పై నిషేధంతో హోటల్ యజమానులు విచారిస్తుంటే, వినియోగదారులు సంతోషిస్తున్నారు. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సోమవారం జారీ చేసిన మార్గదర్శకాలతో దేశవ్యాప్తంగా ఆతిథ్యరంగంలో ఇదే పరిస్థితి. సేవా రుసుము (సామాన్య భాషలో టిప్స్) చెల్లించడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదనీ, ఎవరైనా నిర్బంధంగా వసూలు చేస్తుంటే 1915 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చనీ సీసీపీఏ తేల్చేసింది. ఆతిథ్యరంగ ప్రతినిధులు మాత్రం శ్రామికులకు ఉపకరించే సర్వీస్ ఛార్జ్‌లో చట్టవిరుద్ధమేమీ లేదనీ, దీనిపైన కూడా పన్ను చెల్లిస్తున్నం దున ప్రభుత్వానికి ఆదాయం వస్తోందనీ వాదిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వృద్ధి, కొనుగోలుశక్తి లాంటి సమస్యలుండగా సర్కారు ‘టిప్స్’ అంశంపై దృష్టి పెట్టడం విచిత్రమే.
ఇష్టపడి స్వచ్ఛందంగా ‘టిప్స్’ ఇవ్వడం వేరు. తప్పనిసరి అంటూ ముక్కుపిండి వసూలు చేయడం వేరు. ఈ వాదనే ఇప్పుడు హోటళ్ళలో విధిస్తున్న సేవా రుసుమును చర్చనీయాంశం చేసింది. వినియోగదారులు తాము అందుకున్న సేవలకు సంతృప్తి చెంది, ఇష్టంతో ఇవ్వాల్సిన సేవా రుసుమును చాలాచోట్ల బిల్లులో తప్పనిసరి భాగం చేశారు. అయిదేళ్ళ క్రితం దేశమంతటా అమలైన ‘వస్తు, సేవల పన్ను’ దీనికి అదనం. హోటల్‌లో తిండికి అయిన ఖర్చు మీద 5 నుంచి 15 శాతం దాకా సేవా రుసుమును హోటల్ వారే వేసి, ఆ రెంటినీ కలిపిన మొత్తం మీద ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) వసూలు చేయడం సరికాదన్నది కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదు.
తినడానికి అయిన బిల్లు మీద ఎలాగూ సర్కారీ ‘వస్తు, సేవల పన్ను’ వసూలు చేస్తున్నప్పుడు, మళ్ళీ విడిగా హోటల్ వారి ‘సేవా రుసుము’ ఏమిటి? దీని వల్ల ఒకటి రుసుము, మరొకటి పన్ను అంటూ ఒకే సేవకు రెండుసార్లు చెల్లిస్తున్నట్లు అవుతోందనేది ఫిర్యాదీల వాదన. ఆ వాదన తార్కికమే. కానీ, సేవలందించే శ్రామికుడిని మానవీయ కోణంలో చూస్తే సరైనదేనా? హోటళ్ళు అంటున్నదీ అదే!
సర్వీస్ ఛార్జ్‌కు చట్టబద్ధత ఏమీ లేకున్నా, బేరర్ శ్రమను గుర్తించి, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడం నైతికంగా ధర్మమే. అలాగని కొన్నిసార్లు సేవలు అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బిల్లులో భాగంగా 10 శాతం తప్పనిసరి ‘సర్వీస్ ఛార్జ్’ను చెల్లించాల్సి వస్తున్న అనుభవాలూ లేకపోలేదు. దీనిపై ఫిర్యాదుల మేరకు కొన్నేళ్ళుగా వినియోగదారుల మంత్రిత్వ శాఖకూ, దేశంలోని 5 లక్షల పైచిలుకు రెస్టారెంట్ల పక్షాన నిలిచే ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్నార్‌ఏఐ)కీ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే, జీఎస్టీ విధింపు కన్నా ముందే 2017 ఏప్రిల్‌లోనే హోటళ్ళలో సర్వీస్ ఛార్జ్ వసూలుపై మంత్రిత్వ విభాగం మార్గదర్శకాలిచ్చింది. రెస్టారెంట్‌కు వచ్చినంత మాత్రాన సర్వీస్ ఛార్జ్‌కి కస్టమర్ అంగీకరించినట్టు కాదని పేర్కొంది. ఛార్జ్ కట్టే పక్షంలోనే ఆర్డర్ చేయాలంటూ, కస్టమర్ ప్రవేశంపై షరతులు పెట్టడం చట్టప్రకారం ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ అవుతుందన్నది. మెనూ కార్డులో పేర్కొన్న రేట్లు, ప్రభుత్వం విధించే పన్నులు మినహా మరే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. తద్విరుద్ధమైన అనుచిత విధానాలపై కస్టమర్లు న్యాయవేదికలను ఆశ్రయించవచ్చని తెలిపింది.
‘అనుచిత వాణిజ్య పద్ధతి’ లాంటి పెద్ద పెద్ద మాటలు ఈ ‘టిప్స్’కు వర్తిస్తాయా, లేదా అన్నది పక్కనబెడితే, సర్వీస్ ఛార్జ్‌ను ఆపేయాలంటూ ఇలా 2017 నుంచి 2019 మధ్య కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చిందన్నది నిజం. అయినా హోటళ్ళ బిల్లులో తప్పనిసరి సర్వీస్‌ఛార్జ్ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దాని ఫలితమే ఫిర్యాదులు, ప్రభుత్వ తాజా నిర్ణయం. నెల రోజుల క్రితం జూన్ 2న కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం దీనిపై హోటళ్ళ సంఘం వారితో సమావేశం జరిపింది. చివరకు సోమవారం నాటి సీసీపీఏ మార్గనిర్దేశనంతో ఇకపై హోటళ్ళు తప్పనిసరి సేవా రుసుము వసూలు చేయడం పూర్తి నిషిద్ధం. సీసీపీఏ చట్టబద్ధ సంస్థ. ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం– 2019’ కింద హక్కులు అమలయ్యేలా చూసేందుకూ, ఉల్లంఘించినవారిని శిక్షించేందుకూ రెండేళ్ళ క్రితమే 2020 జూలైలో ఏర్పాటైందనేది గమనార్హం.
గతంతో పోలిస్తే 2021–22లో ఆతిథ్యరంగంలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు శ్రామికు లకు ప్రోత్సాహకంగా దక్కే టిప్స్ కూడా రద్దు అంటే కష్టమని హోటల్ యజమానుల అభిప్రాయం. ప్రభుత్వ లావాదేవీలకు ‘ప్రాసెసింగ్ ఫీ’ అనీ, రైలు, సినిమా టికెట్ల బుకింగ్‌కు ‘కన్వీనియన్స్ ఫీ’ అనీ, ఫుడ్ డెలివరీకి ‘రెస్టారెంట్ ఛార్జెస్’ అనీ రకరకాల పేర్లతో అనేక రంగాలు సేవా రుసుము వసూలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అనుమతిస్తూ, ఆతిథ్యరంగంపై ఈ దాడి ఏమిటన్నది వారి వాదన. అలాగే, టిప్స్ రద్దుతో శ్రామికులకు కలిగే నష్టం భర్తీకి జీతాలు పెంచడం, దానికై హోటల్ రేట్లు పెంచడం అనివార్యం కావచ్చు. అయితే, కోవిడ్ అనంతరం ఆహార, ఇంధన ద్రవ్యోల్బణంతో సతమతమవుతూ ఇప్పటికే రేట్లు పెంచి, ఇరుకునపడ్డ హోటళ్ళు మరోసారి ఆ పని చేయగలవా? అయినా, అందుకున్న సేవల పట్ల సంతృప్తిని బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి కస్టమర్లు ఇవ్వాల్సినదాన్ని కొన్ని హోటళ్ళు తప్పనిసరి అనబట్టే తలనొప్పి. యూరప్, యూకేల పద్ధతిలో మన దగ్గరా కస్టమర్ల ఇష్టానికే టిప్స్ చెల్లింపును వదిలేయాలి. అయినా, హోటల్‌లో టిప్ లాంటివాటి కన్నా కోవిడ్ పడగ నీడలోని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే పని మీద మన పాలకులు పరిశ్రమిస్తే దేశానికి మంచిదేమో!
Comments
Please login to add a commentAdd a comment