ఇష్టముంటేనే సర్వీస్ చార్జీ
హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో స్పష్టం చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్వీస్ చార్జీ విధించే ముందు తప్పనిసరిగా వినియోగదారులను అడగాలని ప్రభుత్వం పేర్కొంది. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమని, ఇది టిప్‌లాంటిదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే పేర్కొన్నారు. అయితే చాలా హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో పది శాతం వరకూ సర్వీస్ చార్జీ విధిస్తున్నాయని వివరించారు. వినియోగదారులను అడిగిన తర్వాతనే హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీ విధించాలని పేర్కొన్నారు. ఆ ‘సర్వీస్’ నచ్చకపోతే వినియోగదారులు ఈ సర్వీస్ చార్జీని చెల్లించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ చార్జీ చెల్లించాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టమని పేర్కొన్నారు.
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవడానికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెస్టారెంట్లు... బిల్లులపై 12.5 శాతం వ్యాట్‌ను, 6 శాతం సర్వీస్ ట్యాక్స్‌లతో పాటు సర్వీస్ చార్జీని కూడా విధిస్తున్నాయి. వినియోగదారుల హక్కులకు సంబంధించి అవగాహనను పెంచడానికి వివిధ చర్యలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకుందని హెమ్ పాండే చెప్పారు. కొత్త వినియోగదారుల రక్షణ బిల్లును రూపొందించామని వివరించారు.