గాడి తప్పిన విశ్వవిద్యాలయం! | SKU University Higher Officers Negligence On Students Convocation In Anantapur | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా నిర్వహించని కాన్వొకేషన్‌

Published Fri, Jan 17 2020 8:17 AM | Last Updated on Fri, Jan 17 2020 8:17 AM

SKU University Higher Officers Negligence On Students Convocation In Anantapur - Sakshi

ఏ విద్యార్థికైనా కాన్వొకేషన్‌ రోజున పట్టా అందుకోవడం గొప్ప అనుభూతి. కానీ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆ భాగ్యానికి నోచుకోవడం లేదు. ఏటా నిర్వహించాల్సిన కాన్వొకేషన్‌ను మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో పట్టాలు అందుకునేందుకు విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పట్టా కావాల్సి వస్తే నిర్ణయించిన రుసుం కన్నా రూ.1,000 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక దూరవిద్యలో చదువు పూర్తి చేసిన వారైతే ఏకంగా రూ.2,350 కట్టాల్సి వస్తోంది. ఇలా 22 వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...ఎస్కేయూ ఉన్నతాధికారులు  పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 

సాక్షి, ఎస్‌కేయు(అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలన గాడి తప్పింది. వర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సకాలంలో అడ్మిషన్లు, పరీక్షలు నిర్వహించడంలో విఫలమవుతున్న వర్సిటీ ఉన్నతాధికారులు కనీసం ఏడాదికోసారి నిర్వహించాల్సిన కాన్వొకేషన్‌లోనూ విఫలమయ్యారు. దీంతో ఎందరో నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మూడేళ్లుగా అతీగతీ లేదు 
ఎస్కేయూ 18వ స్నాతకోత్సవం నోటిఫికేషన్‌ 20 జూలై 2017న జారీ చేశారు. అదే సంవత్సరం ఏడాది చివరన స్నాతకోత్సవం నిర్వహించారు. 2013–14, 2014–15, 2015–16 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు 18వ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీంతో 2016 ఏప్రిల్‌లోపు ఉత్తీర్ణులైన విద్యార్థులు స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి మళ్లీ కాన్వొకేషన్‌ ఊసే లేదు. దీంతో  2016–17, 2017–18, 2018–19 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. మొత్తం 22 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనివార్యంగా ఇన్‌అడ్వాన్స్‌డ్‌ స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇలా రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 22 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవ రుసుము కంటే అదనంగా రూ.1,000 చొప్పున మొత్తంగా రూ.2.2 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. 

దూరవిద్య డిగ్రీల పేరుతో దోపిడీ 
రెగ్యులర్‌ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇన్‌అడ్వాన్స్‌డ్‌ స్నాతకోత్సవ ఫీజు రూ.1,650 అయితే దూరవిద్య డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ. 3 వేలుగా నిర్ధారించారు. దూరవిద్య విభాగంలోనూ 10 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాకు నిరీక్షిస్తున్నారు. స్నాతకోత్సవ సమయంలో అయితే రూ.650 రుసుము కడితే పట్టా ప్రదానం చేస్తారు. ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే అదనంగా రూ. 2,350 చొప్పున ఒక్కో విద్యార్థి రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో దూరవిద్యలో డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు మొత్తంగా రూ.2.35 కోట్లు అదనగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇలా రెగ్యులర్, దూరవిద్య విధానంలో మొత్తం రూ. 4.55 కోట్ల మేర విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. దూరవిద్య విభాగంలో ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కింద ఒక్కో పట్టాకు నిర్ణయించిన రుసుము రూ. 3 వేలు, ఒక ఏడాది కోర్సు ఫీజుతో సమానం కావడం గమనార్హం.  

కీలకమైన అంశాలు విస్మరణ 
ఏటా స్నాతకోత్సవం నిర్వహించి విద్యార్థులకు పట్టాలు అందజేయాలి. కానీ మూడేళ్లుగా కాన్వొకేషన్‌ నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు వర్సిటీ పెద్దలు, అటు పాలక మండలి సభ్యులూ దీనిపై పెద్దగా చొరవ చూపకపోవడంతో విద్యార్థులు వైభవంగా నిర్వహించే కాన్వొకేషన్‌లో అందరి ముందు పట్టాలు పొందే బాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇప్పడైనా కాన్వొకేషన్‌ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. 

టి.అనిల్‌ కుమార్‌ ఎస్కేయూలో 2017 మార్చి నాటికి పీజీ చేశాడు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పట్టా సమర్పించాల్సి రావడంతో ఎస్కేయూ పరీక్షల విభాగంలో దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి పరీక్ష ఫీజు రూ. 650 కడితే కాన్వొకేషన్‌ రోజున పట్టా ఇచ్చేవారు. అయితే మూడేళ్లుగా కాన్వొకేషన్‌ ఊసే లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్‌అడ్వాన్స్‌డ్‌ కింద రూ.1,650 ఫీజు కట్టాల్సి వచ్చింది. అనిల్‌కుమార్‌ లాంటి వారు దాదాపు 22 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 

ఇంకా నిర్ణయం తీసుకోలేదు  
స్నాతకోత్సవ నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను వైస్‌ చాన్స్‌లర్‌ పరిశీలనకు తీసుకెళ్తాం. ఆయన సూచన మేరకు స్నాతకోత్సవ నోటిఫికేషన్‌ తేదీ ఖరారు చేస్తాం. 
– ప్రొఫెసర్‌ ఎ.మల్లిఖార్జున రెడ్డి, రిజిస్ట్రార్, ఎస్కేయూ    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement