భోజనంలో వచ్చిన పురుగు
ఆకలి అవుతుందని భోజనం చేద్దామనుకుంటే రుచీపచీ లేని ఆహారం. పైగా పురుగులు వస్తుండడంతో తినలేక పేద విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. భోజనంలో పురుగులు వస్తుండడంతో పిల్లలు వృథాగా పడేశాయి. ఖాళీ కడుపుతో తరగతులకు హాజరయ్యారు.
ఈ ఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. అసలే ఎదిగే పిల్లలు.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఆహారం అందించాలి. ఇవన్నీ కాకుండా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి భోజనం అందిస్తుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
పెద్దేముల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం తీరుపై సమీక్షిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అభాసుపాలవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యాశాఖ అధికారులు తిలోదకాలిచ్చారు.
ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మండల ఇన్‌చార్జి మండల విద్యాధికారిగా వ్యవహరిస్తున్న పాఠశాలలోనే విద్యార్థులకు పురుగుల అన్నం.. నీళ్ల చారు అందిస్తుండడం గమనార్హం. పురుగుల బువ్వ మాకు వద్దు అంటూ విద్యార్థులు భోజనం పడేశారు. వారంలో ఆరు రోజులు పప్పు చారే.. మెనూ జాడ లేదు.. పేరుకు మాత్రమే మధ్యాహ్న భోజనం అంటూ విద్యార్థులు వాపోతున్నారు.
పెద్దేముల్ మండల కందనెల్లి ఉన్నత పాఠశాలల్లో 280 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం రోజు మాదిరే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. అయితే భోజనం సమయంలో కొంతమంది విద్యార్థుల పల్లెంలో తెల్లని పురుగులు కనిపించాయి. వాటిని చూసి విద్యార్థులు భోజనంపైనే ఏహ్యభావం పెంచుకున్నారు.
వెంటనే విద్యార్థులందరూ కలిసి భోజనం పడేశారు. ఇది ఈ పాఠశాలలో తరచూ జరిగే సంఘటన అని విద్యార్థులు వాపోయారు. ఈ విషయమై సార్లకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా ప్రభుత్వం అందించిన మధ్యాహ్న భోజన మెనూ ఎక్కడా అమలు కావడం లేదు.
వారంలో మూడుసార్లు కోడిగుడ్డు ఇవ్వాలనే ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. మండల విద్యాధికారి ఉన్న పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజన పరిస్థితి ఇలా ఉండడం ఆశ్చర్యమేస్తోంది. వారంలో కనీసం మూడు రోజులు కూడా కురగాయలతో కూడిన భోజనం అందించడం లేదని విద్యార్థులు వాపోయారు.
అధికారుల పర్యవేక్షణ లేక భోజన సిబ్బంది ఇష్టమొచ్చిన రీతిన వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. గుడ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని అరటిపండ్లతో సరిపెడుతున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారి, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ వివరణ కోరగా అన్నంలో పురుగులు వచ్చిన విషయం వాస్తవమన్నారు. ఇక ముందుదిలా జరిగే చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. భోజన సిబ్బందిపై మందలించిన నేటిలోపు మెనూను అమలు చేయిస్తానని తెలిపారు.
ఇలా అయితే ఎలా తినేది..
మధ్యాహ్న భోజనంలో చాలాసార్లు పురుగులు వచ్చాయి. ఈ విషయం సార్లకు చెప్పాం. ఆయాలకు చెప్పితే చింతపండులో వచ్చి ఉండొచ్చని తీసివేసి తినమంటున్నారు. పురుగుల అన్నం ఎలా తినాలి. అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు మంచి భోజనం అందించాలి. – వినిల్‌కుమార్, పదో తరగతి, కందనెల్లి ఉన్నత పాఠశాల
ఆరు రోజులు పప్పే వడ్డింపు
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇస్తామని చెబుతారు. కానీ మా బడిలో మెనూ కనిపించదు. వారంలో ఆరు రోజులు పప్పే వడ్డిస్తారు. కూరగాయలతో కూడిన భోజనం ఉండదు. గుడ్లు ఇవ్వకుండా అరటిపండ్లు ఇస్తున్నారు. ఉప్పు, కారం లేకపోవడంతో తినలేకపోతున్నాం. – శివకుమార్, పదో వరగతి, కందనెల్లి ఉన్నత పాఠశాల
మెనూ పాటించడం లేదు
ప్రభుత్వం చెప్పిన మెనూను పాటించడం లేదు. వారంలో మూడు రోజులు కూరగాయలతో కూడిన భోజనం అందించాలి. భోజనం ఎలా వడ్డిస్తున్నారు.. అని ఎవరూ పరిశీలించడం లేదు. మధ్యాహ్న భోజనంలో పురుగులు రాకుండా చూడాలి. మాకు నాణ్యమైన భోజనం అందిస్తే మంచిగా చదువుకుంటాం. – లావణ్య, పదో తరగతి
Comments
Please login to add a commentAdd a comment