వరంగల్: లక్కపురుగుల బాధతో కాజీపేట పరిధిలోని రహమత్ నగర్, వెంకటాద్రి నగర్, విష్ణుపురి కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. వెంకటాద్రి నగర్‌లో ఉన్న ఎఫ్‌సీఐకి కిలోమీటరుకుపైగా దూరం ఉన్న ఈకాలనీలవాసులు లక్కపురుగుల బాధపడలేక ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఎఫ్‌సీఐ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేని తనంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా సిబ్బంది జీతభత్యాలు కలిపి రూ.10 లక్షలకు పైగా లక్కపురుగుల నివారణకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ.. ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
చీకటిపడితే ఇంట్లోనే బందీ..
చీకటి పడిందంటే చాలు.. పలు కాలనీల వాసులు తలుపులు, కిటికీలు మూసుకుని ఇళ్లలోనే బందీలవుతున్నారు. అసలే వర్షాకాలం, ఆపై దోమల బెడద, వీటికి తోడు పట్టణవాసులకు లక్క పురుగులు చుక్కలు చూపెడుతున్నాయి. నీళ్లలో, బియ్యం, వంట పదార్థాల్లో కుప్పలుతెప్పలుగా పడిపోతున్నాయి. దీని వల్ల అన్నం నోట్లోకి వెళ్లట్లేదు.
కనీసం కంటి నిండా నిద్రపోదామంటే ఒంటిపై వాలుతూ.. చెవుల్లో చేరుతూ లక్కపురుగులు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నాయి. లక్కపురుగులు వాలిన చోట దద్దుర్లు వస్తున్నాయని, వీటితో ఆస్పత్రుల పాలవుతున్నామని పలు కాలనీల వాసులు వాపోతున్నారు. పిల్లల బాధ మరీ వర్ణనాతీతంగా మారింది. ఒంటిపై దద్దుర్లు, దురదతో బాధపడుతున్నారు.
వణికిస్తున్న లక్కపురుగులు..
పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి చేరిన రాధమ్మ బువ్వ తిందామని కూర్చుంది. కూర వాసనకు నోరూరింది. నోట్లో బుక్క పెట్టుకుందామనేలోపే గిన్నెలో లక్కపురుగు కనిపించింది. ఆకలి మంటతో ఉన్న రాధమ్మకు ఆ పురుగులు చూడగానే ముద్ద దిగలేదు. ఈ పరిస్థితి ఒక్క రాధమ్మదే కాదు.. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) సమీపంలోని కాలనీల వారందరిదీ.
పట్టించుకోని అధికారులు..
లక్కపురుగుల నివారణకు లక్షలాది రూపాయలు మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెడుతున్నట్లుగా అధికారులు లెక్కలు చూపుతున్నారు. అయినప్పటికీ ఫలితం కన్పించట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్కపురుగుల వల్ల పడుతున్న నష్టాలు తెలుపుతూ ఏరియా మేనేజర్‌కు పట్టణవాసులు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. అవన్నీ చెత్తబుట్టలోనే చేరుతున్నాయంటూ బాధిత కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్క పురుగులను నివారించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గతంలో రాజకీయ పార్టీలకతీతంగా ఆందోళనలు చేపట్టారు. అప్పుడు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. జనవాసాల మధ్య గోదాంలు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్‌సీఐ అధికారులు లక్కపురుగుల నివారణ చర్యలను ముమ్మరం చేసి ఇబ్బందులను తొలగించాలని కాజీపేటవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment