కొరడా ఝుళిపిస్తున్నా కానీ.. కలకలం రేపుతున్న సస్పెన్షన్లు!! | - | Sakshi
Sakshi News home page

కొరడా ఝుళిపిస్తున్నా కానీ.. కలకలం రేపుతున్న సస్పెన్షన్లు!!

Published Sun, Oct 8 2023 1:20 AM | Last Updated on Sun, Oct 8 2023 8:26 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: భూ దందాలు, సెటిల్‌మెంట్లకు పెట్టింది పేరుగా మారిన కొందరు పోలీస్‌ అధికారులను గాడిన పెట్టేందుకు సీపీ ఏవీ రంగనాథ్‌ చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. అక్రమార్కులను సక్రమ మార్గాన నడిపించేందుకు తరచూ కొరడా ఝుళిపిస్తున్నా.. అది కొద్దిరోజులకే పరిమితమవుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు.. స్పందించి క్షేత్రస్థాయి విచారణ జరిపి సస్పెన్షన్‌ వేటు వేస్తున్నా కొందరి తీరులో మార్పు రావడం లేదు.

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికే కానిస్టేబుల్‌నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకు పలువురిపై సస్పెన్స్‌ వేటు పడింది. ఉద్యోగులు, సామాన్యులు రూపాయి రూపాయి పోగేసుకుని సొంతింటిని నిర్మించుకోవాలని కొనుగోలు చేసిన భూములకు భద్రత లేకుండా పోయింది. కొందరు పోలీసులే కబ్జాదారులకు సహకరిస్తూ సస్పెన్షన్లకు గురవుతుండడం చర్చనీయాంశమవుతోంది.

అయినా కావాలి కాసులు..
హద్దుమీరుతున్న పోలీసులను గాడిన పెట్టేందుకు పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ చేపడుతున్న చర్యలు కలకలం రేపుతున్నా.. కొద్ది రోజులకే మళ్లీ కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు వివాదాస్పదమవుతున్నారు.
భూ దందాలు, సెటిల్‌మెంట్ల వ్యవహారంలో మొదటి వేటు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆర్‌.వెంకటేశ్వర్లుపై పడింది. భూ కబ్జాదారులతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలకు తోడు ఓ మహిళా ఎస్సైతో హద్దులు మీరి వ్యవహరించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఆ మహిళా ఎస్‌ఐపైన వేటు పడింది.
ఆ తర్వాత నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసిన ఏఎస్సై నాగరాణి ఒకరి వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకపోగా.. ఆమైపె హనుమకొండ స్టేషన్‌లో కేసు నమోదవడంతో సస్పెండ్‌ చేశారు.
పీడీఎస్‌ బియ్యం దందా, గుడుంబా తయారీదారుల నుంచి డబ్బు గుంజడం, బీమా స్కాంలో నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకున్న నల్లబెల్లి ఎస్‌ఐ రాజారాంను సీపీ సస్పెండ్‌ చేశారు.
భూ తగాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదుపై మట్టెవాడ సీఐ సీహెచ్‌ రమేశ్‌ను.. ఇవే రకమైన ఆరోపణల్లో కేయూసీ సీఐ దయాకర్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు.
టాస్క్‌ఫోర్స్‌లో సీఐగా ఉన్న సీఐ నరేశ్‌తోపాటు హెచ్‌సీ శ్యాంసుందర్‌, మరో ఇద్దరు కానిస్టేబు ళ్లను భూసెటిల్‌మెంట్లు, వసూళ్ల ఆరోపణలపై సస్పెండ్‌ చేశారు.
రంగురాళ్ల వ్యాపారిని బెదిరించిన ఘటనలో కమిషనరేట్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి, రిమాండ్‌కు తరలించి సస్పెండ్‌ చేశారు.
హసన్‌పర్తి, ధర్మసాగర్‌ ఇన్‌స్పెక్టర్లను వీఆర్‌కు బదిలీ చేశారు.
తాజాగా భూసంబందిత విషయాల్లో బాధితుల పక్షాన కాకుండా అక్రమార్కులకు వత్తాసు పలికారన్న ఫిర్యాదులపై విచారణ జరిపించి నర్మెట సీఐ పాటి నాగబాబు, ఎస్సై గైకాడి అనిల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ.. వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

వివాదంలో నగర ఇన్‌స్పెక్టర్లు?
కమిషనరేట్‌ పరిధిలోని సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని ఇద్దరు నగర ఇన్‌స్పెక్టర్ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. భూ కబ్జాదారులతో దోస్తీ చేసి.. భూ ఆక్రమణల కోసం కొందరు అసాంఘిక శక్తులతో టీమ్‌లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలపై అక్కడ పనిచేసిన ఇన్‌స్పెక్టర్లపై గతంలో బదిలీ, సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆ ఠాణాల్లో పోస్టింగ్‌ పొందిన వారు తిరిగి అవే తరహా కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూకబ్జాదారులను కట్టడి చేసేందుకు ‘అవసరమైతే పీడీ యాక్ట్‌ నమోదు చేయాలి’ అన్న సీపీ ఆదేశాలను ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. ఇటీవల భూ క్రయవిక్రయాల్లో వివాదాస్పదుడని పేరున్న ఓ వ్యాపారిని పిలిపించిన ఓ ఇన్‌స్పెక్టర్‌ ‘నీపై ఫిర్యాదులున్నాయి.. పీడీ యాక్టు పెడతా’నని పెద్దమొత్తంలో డిమాండ్‌ చేసి కొంత ముట్టజెప్పాకే శాంతించారని తెలిసింది. మరో ఇన్‌స్పెక్టర్‌ పాత రౌడీషీటర్ల కౌన్సెలింగ్‌ పేరిట ఇద్దరు భూదందాదారులను ఇదే తరహాలో బెదిరించినట్లు తెలిసింది.

నర్మెట సీఐ, ఎస్సై సస్పెన్షన్‌
భూవివాదంలో అక్రమార్కులకు వత్తాసు పలికినందుకు నర్మెట సీఐ పాటి నాగబాబు, ఎస్సై గైకాడి అనిల్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధి అమ్మాపూర్‌కు చెందిన చెక్కిళ్ల లక్ష్మ య్య, వెంకటేశ్వర్లు, రవీందర్‌ అన్నదమ్ములు.

35 ఏళ్ల క్రితం లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఈక్రమంలో తల్లిదండ్రుల బాధ్యత చూసుకొమ్మని తమ్ముడు రవీందర్‌కు చెప్పారు. ఇందుకుగాను అమ్మాపురంలోని తమ పాలుకు వచ్చిన భూమిని అప్పగించారు. అలాగే.. హైదరాబాద్‌లోని ఆస్తి తాము తీసుకుంటామని చెప్పారు. ఈక్రమంలో గతేడాది గ్రామానికి వచ్చిన లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు గతంలో తాము అప్పగించిన భూమి ఇవ్వాలని తమ్ముడిని నిలదీశారు.

దీంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. అయితే.. సీఐ నాగబాబు, ఎస్సై అనిల్‌కుమార్‌.. రవీందర్‌ను పిలిపించి మాట్లాడారు. రవీందర్‌, అతడి భార్య, కుమారులపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు వరంగల్‌ సీపీ రంగనాథ్‌ను ఆశ్రయించాడు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో బుధవారం గ్రామానికి చేరుకున్న పోలీసు అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. స్థానికుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ నివేదికను అందుకున్న సీపీ సీఐ, ఎస్సైని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement