వరంగల్: శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక శివారు కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో మంచినీళ్లు అనుకొని ఓ విద్యార్థి హైడ్రోజన్ పెరాక్సైడ్ తాగి అస్వస్థతకు గురైంది. పదోతరగతి చదువుతున్న పల్లకొండ పూర్ణ ఉదయం స్నాక్స్ టైంలో బిస్కెట్ తిన్నది. గొంతులో తట్టుకున్నట్లు కావడంతో మినరల్ వాటర్ ప్లాంట్ సమీపంలో ఉన్న ఓ బాటిల్‌లోని నీళ్లు తాగింది.
కానీ ఆ బాటిల్‌లో మంచినీళ్లకు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండడంతో పూర్ణ గొంతులో మంటగా అనిపించి ఊమ్మేసింది. గట్టిగా అరిచింది. గమనించిన సిబ్బంది, ఉపాధ్యాయులు పూర్ణని చికిత్స నిమిత్తం పరకాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స అనంతరం పూర్ణను ఆమె బంధువుల ఇంటికి తరలించారు. ప్రస్తుతం పూర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా.. పూర్ణ రెండు నెలల క్రితం విద్యార్థుల మధ్య గొడవలతో తన వద్ద ఉన్న నెయిల్ పాలిష్ తాగింది. ఇంత జరుగుతున్నా.. అక్కడి స్పెషల్ ఆఫీసర్ పట్టించుకోవట్లేదనే విమర్శలొస్తున్నాయి. ‘నేను ఆ ఘటనలు జరిగిన సమయంలో అందుబాటులో లేను’ అని సాకులు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేజీ బీవీలో ఏం జరుగుతుందో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment