వరంగల్: ఇటీవలి వర్షాలకు గోడ కూలడంతో హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలో ఇద్దరు మృతి చెందారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో మరొకరు ప్రాణాలు విడిచారు. మండల కేంద్రానికి చెందిన ముష్కే భాగ్యలక్ష్మి భర్త సురేశ్ కొంతకాలం క్రితం మృతి చెందాడు. ఆమె ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు మొత్తం కూలిపోయింది.
దాని పక్కనే చిన్న రేకుల షెడ్డు వేసుకుని ఆమె కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి గోడలన్నీ నానిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా గోడ కూలింది. ఆస్పత్రికి వెళ్లొస్తున్న స్థానికురాలు పొట్టకారి సుభద్ర గమనించి కొంతమందిని లాగి దూరంగా నెట్టేసింది. ఈఘటనలో మోర సాంబయ్య(65), లోకలబోయిన సారలక్ష్మి(55)పై గోడ కూలింది.
వారిని రక్షించేందుకు స్థానికులు చింతల రవిపాల్, మోరే మల్లక్క, గాజె మల్లేశం, అతడి కుమారుడు సదానందం ప్రయత్నించారు. కానీ.. అప్పటికే సాంబయ్య, సారలక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై దేవేందర్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేశారు. తహసీల్దార్ సుభాషిణి, ఆర్‌ఐ శరత్‌కుమార్ ఘటన వివరాలు సేకరించారు.
అంబులెన్స్ ఆలస్యంతో జోగమ్మ మృతి!
దామెర మండలం కోగిలవాయి నుంచి వినయ్ తన అమ్మమ్మ అయిన బోగి జోగమ్మ (గోడ కూలిన ఇంటి పక్క గృహస్తురాలు)ను తీసుకెళ్లేందుకు శుక్రవారం ఆటోలో శాయంపేటకు వచ్చాడు. ఈక్రమంలో ఆమె సన్నబియ్యాన్ని సంచిలో నింపి ఆటోలో వేస్తుండగా.. గోడ కూలి జోగమ్మపై మట్టిపెల్లలు పడి నడుము, కాళ్లు విరిగాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
ఆలస్యం అవుతోందని మళ్లీ మళ్లీ ఫోన్ చేశారు. ఒకసారి పరకాల, మరోసారి ఆత్మకూరు, ఇంకోసారి దామెర నుంచి అంబులెన్స్ వస్తుందని అవతలి నుంచి సమాధానం వచ్చింది. అంబులెన్స్ ఆలస్యం అవుతుండడంతో జోగమ్మను ఆస్పతికి తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కించారు. సమాచారం ఇచ్చిన గంట 15 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. సీపీఆర్ చేసి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో ఆమె మృతి చెందింది.
పండుగకు వచ్చి కానరాని లోకాలకు..
శాయంపేటకు చెందిన మోరె సాంబయ్య స్థానికంగా పని దొరక్క సిరిసిల్లలో నేత పని చేస్తూ బతుకు బండిని లాగుతున్నాడు. వినాయక చవితికి శాయంపేటకు వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం బీడీలు కొనుక్కునేందుకు వెళ్తుండగా.. రోడ్డు పక్కనే ఉన్న ఇంటి గోడ కూలి సాంబయ్య మృతి చెందాడు. సాంబయ్య మృతితో కుటుంబం రోడ్డున పడింది.
పని కోసం ఆరా తీసేందుకు వెళ్తూ..
మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన లోకలబోయిన సారలక్ష్మి భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె శాయంపేటలోని గోడ కూలిన పక్క ఇంట్లో అద్దెకు ఉంటూ కూలీ పనికి వెళ్తోంది. శుక్రవారం పని ఉంటే చెప్పమని కాలనీవాసులకు చెప్పి వస్తుండగా.. గోడ కూలడంతో ఆమె మృతి చెందింది.
జెడ్పీ చైర్‌పర్సన్ పరామర్శ!
పరకాల ప్రభుత్వాస్పత్రిలో సాంబయ్య, సారలక్ష్మి, జోగమ్మ మృతదేహాల వద్ద వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ. 5 వేల నగదు ఆర్థికసాయం అందించారు. ప్ర భుత్వం నుంచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
నలుగురిని కాపాడిన..
నాకు జ్వరం వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తిరిగొస్తుండగా.. పోచమ్మ వీధికి వెళ్లే సీసీ రోడ్డు పక్కనే ఉన్న ఇల్లు గోడ కూలడాన్ని గమనించిన. అక్కడే ఉన్న కొందరిని, పిల్లలను లాగిన.. దూరంగా నెట్టేసిన. దీంతో నలుగురిని ప్రాణాపాయం నుంచి తప్పించిన. – పొట్టకారి సుభద్ర, స్థానికురాలు
సమయానికి అంబులెన్స్ వస్తే జోగమ్మ బతికేది..
ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్ చేశాం. అంబులెన్స్ ఒకసారి పరకాల నుంచి వస్తుందని, మరోసారి ఫోన్ చేస్తే.. దామెర నుంచి వస్తుందని, ఇంకోసారి ఆత్మకూరు నుంచి వస్తుందని సుమారు గంట 15 నిమిషాలు సమయం వృథా చేశారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో జోగమ్మ మృతి చెందింది. ఇప్పటికై నా శాయంపేట మండల కేంద్రంలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. – చింతల రవిపాల్
Comments
Please login to add a commentAdd a comment