సతీష్(ఫైల్)
హనమకొండ: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన గురువారం మండలంలోని వెంకటాపూర్‌లో జరిగింది. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఇజ్జగిరి సతీష్(36) దామెర తహసీల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సతీష్ భార్య లిఖితకు, తల్లి లక్ష్మికి గొడవ జరిగింది.
దీంతో ఇద్దరిని సముదాయించి సతీష్ తన కూతురుతో ఒక గదిలో నిద్రించేందుకు వెళ్లాడు. ఇంట్లో జరిగిన గొడవను తలుచుకుంటూ మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురు ఉదయం లేచి చూసి కేకలు వేయగా బంధువులు వచ్చి చూసేసరికి సతీష్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
ఇటీవలే ఉద్యోగ భద్రత పొందిన సతీష్..
సతీష్.. ఏపీపీఎస్సీ ద్వారా 2012లో వీఆర్‌ఏగా ఎంపికై ఉమ్మడి ఆత్మకూరు, దామెర మండలాల తహసీల్ కార్యాలయంలో 11 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 10, 2023న వీఆర్‌ఏలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించగా, సతీష్ దామెర తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
పోరాడి సాధించుకున్న ఉద్యోగంలో చేరి 2 నెలలు గడవకముందే సతీష్ మృతి చెందడం పలువురిని కలిచివేసింది. దామెర, గీసుకొండ, నడికూడ తహసీల్దార్లు జ్యోతివరలక్ష్మీదేవి, రియాజుద్దీన్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు.. సతీష్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment