మిస్టరీగా వాజేడు ఎస్సై ఆత్మహత్య
హరీశ్ బలవన్మరణానికి యువతే కారణమా?
ఇప్పటి వరకూ వివరాలు వెల్లడించని పోలీసులు
ములుగు : వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలను పోలీసులు ఇప్పటి వరకూ వెల్లడించలేకపోతున్నారు. ఎస్సై ఆత్మహత్య రోజు ఏమి జరిగిందనే అంశం మిస్టరీగా మారుతోంది. నల్లగొండ జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండాకు చెందిన యువతి బ్లాక్ మెయిలింగ్ కారణంగానే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతోపాటు మరేమైన బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు యంత్రాంగం రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. సదరు యువతి ఈ నెల 1వ తేదీన ఎస్సై హరీశ్ కోసం వచ్చినట్లు ఆధారాలతో పూర్తి సమాచారం ఉంది.
ఈ క్రమంలో ఫెరిడోస్ రిసార్ట్‌లోని ఓ గదిలో ఎస్సై ఆత్మహత్య అనంతరం సదరు యువతిని పోలీస్ శాఖతో పాటు ఇతరులు గమనించారు. దీంతో ఎస్సై హరీశ్ ఆత్మహత్య ఘటనలో ఆమె ప్రధాన కారణమా లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హరీశ్ చనిపోక ముందు రోజు యువతితో మాట్లాడే క్రమంలో ఒత్తిడికి లోనై స్నేహితులకు ఫోన్ చేశారు. దీంతో ఓ స్నేహితుడు రిసార్ట్‌కు చేరుకుని యువతితో మాట్లాడి ఆమెను ఒప్పించినట్లు సమాచారం.
సమస్య సద్దుమనిగినట్లు భావించిన ఎస్సై హరీశ్ స్నేహితుడిని వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అతను అక్కడి నుంచి బయలుదేరి ములుగు చేరుకున్నాడు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్ర నుంచి లేచిన సదరు యువతి.. ఎస్సైతో గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో మరోసారి ఒత్తిడికి లోనైన హరీశ్ ఫోన్ ద్వారా స్నేహితుడిని సంప్రదించాడు. అప్రమత్తమైన స్నేహితుడు ములుగు నుంచి బయలుదేరి వాజేడుకు చేరుకోకముందే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?
వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్న సదరు యువతి ఈనెల 1వ తేదీ వాజేడు స్టేషన్ ముందు నుంచి ఎస్సై హరీశ్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వెహికిల్ ద్వారా ఆమెను రిసార్ట్‌కు పంపించారు. అయితే ఈ వాహనాన్ని నడిపిన వాజేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎవరు అనే అంశం ఇప్పటికీ తెలియడం లేదు. చివరికి ఆ యువతిని రిసార్ట్‌లో డ్రాప్ చేసిన అనంతరం రెండు, మూడు సార్లు సదరు వ్యక్తి ప్రైవేట్ వాహనంలో కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఎస్సై హరీశ్ విషయంలో కీలక ఆధారాలు అతని వద్దే?
Comments
Please login to add a commentAdd a comment