రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరిపిన అల్లుడు.. ఒక్కసారిగా కలకలం! | - | Sakshi
Sakshi News home page

రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరిపిన అల్లుడు.. ఒక్కసారిగా కలకలం!

Published Fri, Oct 13 2023 1:20 AM | Last Updated on Fri, Oct 13 2023 12:28 PM

- - Sakshi

హనమకొండ: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని రెండో డివిజన్‌ గుండ్లసింగారంలో గురువారం కాల్పులు కలకలం రేపాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వనందుకు ఓ కానిస్టేబుల్‌ (రైటర్‌) పోలీస్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఒక్కసారిగా తూటా శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

రివాల్వర్‌ ఎత్తుకొచ్చాడు..
నగరంలోని కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌కు గుండ్లసింగారానికి చెందిన రమాదేవితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ప్రసాద్‌తోపాటు అత్త కుటుంబసభ్యులు గుండ్లసింగారంలో వేర్వేరు ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రసాద్‌ రామగుండం కమిషనరేట్‌ పరిధి లోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌(రైటర్‌)గా విధులు నిర్వహిస్తున్నాడు.

నెలకోసారి, రెండు సార్లు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. కొంతకాలం క్రితం ప్రసాద్‌ తన అత్త కమలాదేవి(58)కి రూ.4లక్షల అప్పుగా ఇవ్వగా.. తిరిగి ఆమె ఇవ్వలేదు. దీంతోపాటు అతడి కాపురంలోనూ విబేధాలు వచ్చాయి. ఈనేపథ్యంలో వారిపై కోపం పెంచుకున్న ప్రసాద్‌ అత్తతోపాటు భార్య, బావమరిది టార్గెట్‌ చేశాడు. మొదట అత్తను చంపి ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న బావమరిదిని.. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యను తుదముట్టించాలనుకున్నాడు.

వరుసగా ముగ్గురిని చంపాలంటే తుపాకీ అవసరమని భావించాడు. బుధవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే స్టేషన్‌హౌజ్‌ ఆఫీసర్‌ తన రివాల్వర్‌ని క్లీన్‌ చేసి భద్రపర్చమని ప్రసాద్‌కు చెప్పాడు. కానీ ప్రసాద్‌ ఆ రివాల్వర్‌ను భద్రపరిచి ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం గుండ్లసింగారం వచ్చాడు. గురువారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ రివాల్వర్‌ తీసుకునేందుకు వెళ్లగా కనిపించలేదు.

దీంతో స్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రివాల్వర్‌ను ప్రసాద్‌ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి పోలీసులు ప్రసాద్‌కు ఫోన్‌ చేయగా.. లిఫ్ట్‌ చేయలేదని సమాచారం. కోటపల్లి నుంచి గురువారం ఉదయం గుండ్లసింగారం చేరుకున్న ప్రసాద్‌ నేరుగా అత్త కమలాదేవి ఇంటికి వచ్చి ఆమెను కాల్చాడు. అప్పటికే స్థానికులు గుమిగూడడంతోపాటు కుటుంబ సభ్యులు రావడం.. అతడిపై దాడి చేయడంతో ముందుగా అనుకున్న ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదని తెలుస్తోంది.

తూటా శబ్దంతో కలకలం!
కమలాదేవిపై రివాల్వర్‌తో ఒక రౌండ్‌ కాల్పులు జరపడంతో ఆమె ఇంటి నుంచి రోడ్డుమీదికి రక్తమోడుతూ వచ్చి కింద పడింది. రక్తం కూడా గేటునుంచి పది అడుగుల దూరం పడి ఉంది. ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారు.

కొద్దిదూరంలో ఉన్న ప్రసాద్‌భార్య రమాదేవితోపాటు ఆమె కూతుళ్లు, సోదరుడు హుటాహుటిన వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు. ఓవైపు తల్లి మృతదేహం.. మరో వైపు ప్రసాద్‌ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతడి తల, శరీరంపై తీవ్రగాయాలై రక్తంతో తడిసిపోయాడు.

ఆధారాల సేకరణ..
సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎం.ఏ బారి, వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని, కమలాదేవి కూతురు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనాలు సేకరించారు. కాల్చిన బుల్లెట్‌ షెల్‌ కోసం పోలీసులు గాలించారు. దాదాపు గంటరన్న పాటు వెతికారు. అయినప్పటికీ లభ్యం కాలేదు.

కొంతకాలంగా వేర్వేరుగా..
కొంతకాలంగా ప్రసాద్‌, రమాదేవి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. దీంతో దూరంగానే ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం తనను వేధింపులకు గురి చేస్తున్నాడని రమాదేవి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ప్రసాద్‌ అవమానకరంగా భావించినట్లు చర్చ జరుగుతోంది. దీనంతటికీ భార్యతోపాటు అత్త, బావమరిది కారణమని కోపం పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

సమగ్ర దర్యాప్తు : ఎంఏ బారి, డీసీపీ
హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎంఏ బారి తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక, ఇతరత్రా కారణాలు ఉన్నాయనే అంశంపై విచారణ చేపడతామన్నారు. గుండ్లసింగారంతోపాటు కీర్తినగర్‌లోని నిందితుడి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మృతురాలి కూతురు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement