సాక్షి, వరంగల్: పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ విందులో ఈ నెల 15న గాల్లోకి కాల్పులు జరిపిన బిల్డర్, బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రబెల్లి తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు పరకాల సీఐ జె.వెంకటరత్నం తెలిపారు. ఈ ఘటనపై గురువారం సదరు ఫంక్షన్ హాల్ వద్ద విచారణ చేపట్టారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజేశ్వర్‌రావుతోపాటు సిబ్బందిని విచారించారు.
తనకు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో కొందరిని బెదిరించడంతోపాటు భయపెట్టడానికే తిరుపతిరెడ్డి తన వద్ద ఉన్న రివాల్వర్‌ను ప్రదర్శించి మద్యం మత్తులో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తేలిందని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురై వెళ్లిపోయారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిరెడ్డిని అరెస్ట్ చేసి పరకాల కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కాగా, పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
వ్యక్తిగత భద్రత పేరిట..
మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ వ్యక్తిగత భద్రత పేరిట గన్‌కల్చర్‌పై పలువురు ఆసక్తి చూపుతుండగా.. ఇప్పుడది భద్రత కంటే హోదా, ఫ్యాషన్‌గా మారిపోయింది. ఫలితంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౖపైవేట్ ‘గన్’లు గర్జిస్తున్నాయి. తాగిన మైకంలో మాటలు పెరిగి పట్టరాని ఆవేశంతో ‘ట్రిగ్గర్’ నొక్కుతున్న ఘటనలు వివాదాస్పదం అవుతున్నాయి.
‘క్రెడాయ్’ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బిల్డర్ ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి (సిద్ధార్థ తిరుపతిరెడ్డి) పరకాలలో ఆర్‌ఆర్ గార్డెన్‌లో ఓ దశ దినకర్మకు హాజరై తాగిన మత్తులో రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ నెల 15న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా.. గురువారం అతడిని పోలీసులు పరకాల కోర్టులో హాజరుపర్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
కలకలం రేపుతున్న ‘తుపాకులు’..
హైదరాబాద్, ముంబై వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అక్రమంగా తుపాకులు కలిగి ఉండటం, బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం పాకాయనే చర్చ కొనసాగుతోంది. ఏదో సాకు చూపి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఎక్కువగా తుపాకీ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు.
కమిషనరేట్ పరిధిలో ఇలాంటివారే ఆయుధాల లైసెన్సులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మ రక్షణకు తీసుకున్న వీరిలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తేనే తప్ప తెలవడం లేదు. పరకాలలో కాల్పులు జరిపిన ఘటన కూడా ఐదు రోజుల తర్వాత వెలుగు చూసింది.
ఆగని ఆగడాలు..
2014 ఫిబ్రవరి ఆఖరు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 314 ఆయుధ లైసెన్స్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాంకులు, బ్యాంకుల వద్ద పనిచేసే వారి కోసం ఇచ్చినవి 74, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినవి 240 ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల కోటాలో తీసుకున్న వారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు. 2015 జనవరి 25న వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లా... వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా మారింది. 2016 అక్టోబర్ 11న జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో కమిషరేట్ పరిధి పెరిగింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలు కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి.
ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 180 లైసెన్స్ తుపాకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లైసెన్స్‌లు పొందినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం, ఇతరులను బెదిరించడం, తాను ఆయుధం కలిగిఉన్నానని ఇతరులను ఆందోళనకు గురి చేసినా ఆ లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది. ఆత్మరక్షణ కోసం మినహా ఏ సందర్భంలోనూ ఆయుధం ప్రదర్శించినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు కఠినతరం చేసినా ఆగని ఆగడాలపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.
తిరుపతిరెడ్డి గన్ లైసెన్స్‌పై ఆరా..
పరకాల ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో క్రెడాయ్ అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ నేత గాల్లోకి రివాల్వర్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు పరకాల పోలీసులతోపాటు స్పెషల్ బ్రాంచ్ అఽధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం లేనప్పటికీ.. తిరుపతిరెడ్డికి లైసెన్స్ ఇవ్వడంలో గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి బంధువు కావడమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుపాకీ లైసెన్స్ ఎప్పుడు జారీ అయ్యింది? సిఫారసు చేసిన అఽధికారి ఎవరు? నిజంగానే తిరుపతిరెడ్డి లైసెన్స్‌కు అర్హుడా? అనే అంశాలతోపాటు పలు కోణాల్లో విచారిస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment