సాక్షిప్రతినిధి, వరంగల్: ఉద్యమాలకు కేరాఫ్ అయిన వరంగల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురిపెట్టింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత విప్లవ రాజకీయాలకు అడ్డాగా మారిన ఈప్రాంతంలో కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. పౌరహక్కులు, ప్రజాసంఘాల కార్యకలాపాలు, నాయకుల కదలికలపై నిఘా పెట్టింది.
ఈమేరకు ఎన్‌ఐఏ వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల తరచూ సోదాలు నిర్వహిస్తోంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమైనట్లు సమాచారం ఉందని.. 152 మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఆతర్వాత హరగోపాల్ సహా ఆరుగురిపై కేసులు ఎత్తివేయగా.. ప్రొఫెసర్ ఖాసీం సహా 146 మందిపై విచారణ జరుగుతోంది. గత సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో నమోదైన ఓ కేసు విషయంలో హనుమకొండ హంటర్‌రోడ్డులోని సముద్రాల అనిత ఇంట్లో సోదాలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న కూడా వరంగల్‌లోని ఐదు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా సోమవారం హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డిపేట, పైడిపల్లిలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించి సోదాలు చేయడం సంచలనంగా మారింది.
ఓ వైపు ‘ఉపా’.. మరోవైపు సోదాలు..
మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాల వ్యూహంలో భాగంగా ఎన్‌ఐఏ నిఘా ముమ్మరం చేసింది. ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలపై ఓ వైపు కేసులు.. మరోవైపు ఇళ్లల్లో సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి సమీపంలో మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇతర మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో ములుగు పోలీసులు కూంబింగ్ చేపట్టారు.
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువతను దళంలో చేర్చుకోవడం.. అధికారులు, అమాయక పౌరులను హత్య చేయడం, నిధుల సేకరణ వంటి లక్ష్యాలతో ఈ సమావేశం జరగ్గా, పోలీసుల రాకతో వారంతా పారిపోయారు. ఈమేరకు పస్రా సీఐ ఫిర్యాదు మేరకు అక్కడ పంచనామా నిర్వహించి ఐపీసీ 120బీ, 147, 148 రెడ్ విత్ 149.. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)’లోని సెక్షన్లు 10, 13, 18, 20, 38, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 (1–బీ)(ఎ)ల కింద తాడ్వాయి పోలీసులు 152 మందిపై కేసు నమోదు చేశారు.
మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులు, సమావేశ స్థలం వద్ద లభించిన సాహిత్యంలో ఉన్న ఇతరుల పేర్లపై కేసులు నమోదు చేశారు. 2023 జూన్‌లో ఈ కేసు వెలుగు చూడగా.. ఈ కేసులో ప్రొఫెసర్ హరగోపా ల్, పద్మజా షా, రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని కేసులు ఎత్తివేశారు. ప్రొఫెసర్ కాశీం, పీఓడబ్ల్యూ నేత సంధ్య, విమలక్క సహా 146 మందిపై కేసు కొనసాగుతుంది. ఇదంతా సద్దు మణిగిన కొద్ది రోజులకే ఉమ్మడి జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు ఉధృతం చేయడం కలకలం రేపుతోంది.
‘కవర్ సంఘాల’ కట్టడి.. అనుమానంతో సోదాలు..
మావోయిస్టు పార్టీకి కవర్‌సంఘాలు పని చేస్తున్నాయంటూ పలు ప్రజాసంఘాల నాయకులపై తరచూ కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థి కొన్నేళ్ల క్రితం కిడ్నాప్ కాగా.. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులే కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై 2022న ఎన్‌ఐఏ కేసు టేకప్ చేసింది.
ఈకేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈక్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో చురుగ్గా పని చేసిన సముద్రాల అనిత, ఆమె తల్లిగారిళ్లలో గతేడాది సెప్టెంబర్‌లో సోదాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆమె ఇంట్లో మళ్లీ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కొత్తకొండ శాంతమ్మ ఇంట్లోనూ ఈసారి ఎన్‌ఐఏ సోదాలు చేసింది.
పైడిపల్లిలోని ఆమె ఇంటిని ఉదయమే పోలీసులు చుట్టుముట్టగా.. తర్వాత ఎన్‌ఐఏ అధికారులు ఇల్లంతా తనిఖీ చేశారు. ఇంట్లో ప్రజాకవి వరవరరావుపై ప్రొఫెసర్ కాశీం రాసిన ‘కాగితం మీద అక్షరానికి కమిటైన కవి వరవరరావు’, ‘జన హృదయం జనార్దన్.. అమరుడు సూరపనేని జనార్దన్’ తదితర పుస్తకాలు లభ్యమయ్యాయి. 2016 మార్చి 1న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్ నవత ఫొటోలను పరిశీలించిన అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా.. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా వరంగల్‌లో ఎన్‌ఐఏ దాడులు కలకలం రేపాయి.
Comments
Please login to add a commentAdd a comment