Kurnool Silver Jubilee College
-
మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులుసిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
నేడు సిల్వర్‌జూబ్లీ కాలేజీ ‘రీయూనియన్ ఫెస్ట్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల సూపర్ సీనియర్స్ (1972- 75 మొదటి బ్యాచ్) ‘రీయూనియన్ ఫెస్ట్’ ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ‘సూపర్ సీనియర్స్’ పట్టభద్రులై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన 120 మంది పూర్వవిద్యార్థుల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమాపతి (ఐపీఎస్), ఇద్దరు రిటైర్డు ఐఏఎస్ అధికారులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కీలకస్థానాల్లో ఉన్న హేమాహేమీలు ఎందరో ఉన్నారు. సుదీర్ఘకాలం తర్వాత మిత్రులతో కలిసేందుకు... 40 ఏళ్ల కిందట కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో కలిసి చదువుకున్న మిత్రులందరినీ సమావేశపరచాలని, వారి కుటుంబాలతో అనుభూతులు పంచుకోవాలని ఐవైఆర్ కృష్ణారావు యోచించి పలువురితో సంప్రదించారు. ఈ ఉత్సవానికి హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని సెంట్రల్ పార్కు హోటల్‌ను వేదికగా ఆదివారం ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్‌కు సూపర్ సీనియర్స్తోపాటు వీరికి బోధించిన అధ్యాపకులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవానికి కళాశాల మొదటి బ్యాచ్ వారు మాత్రమే కుటుంబాలతో హాజరుకావాలని కోరారు. రిజిస్ట్రేషన్ వీరికి మాత్రమే పరిమితమని నిర్వాహకులు వైఎస్ మూర్తి (ఫోన్ నంబరు-9885222825), ఆర్ఎస్ లక్ష్మణ్ (ఫోన్ నంబరు-9391007309) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. -
ప్రాంతీయ అస్తిత్వపు దర్శనం
కర్నూలు సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల విడిపోయిన సమైక్య తెలుగు నేలకు ప్రతిరూపం. అన్ని ప్రాంతాల విద్యార్థులూ అక్కడ డిగ్రీ విద్యను అభ్యసిస్తారు. ఆ కళాశాల తెలుగు శాఖ, ‘తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం’ అంశంపై యు.జి.సి. జాతీయ సదస్సు నిర్వహించి, తెలుగు వాళ్లున్న ప్రతి నిర్దిష్ట స్థలం నుండీ తెలుగు కథ ఎలా ప్రాంతీయ సువాసనల్ని వెదజల్లిందో, ఉద్దండులతో ప్రసంగ వ్యాసాలు వినిపించి, వాటిని వాయలీనం కాకుండా పుస్తక రూపంలో తెచ్చింది. తెలుగునేల మీది నాలుగు ప్రాంతాల కథ మీద విశ్లేషణతో పాటు పూర్వపు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక గిరికి బయటి మహారాష్ట్ర, తమిళనాడు, అమెరికాలోని తెలుగు కథల మీద కూడా విశ్లేషణలు కలుపుకున్నదీ పుస్తకం. దీనికి అదనంగా నిర్దిష్టతలో మరింత నిర్దిష్ట అధ్యయనంగా కర్నూలు, గుంటూరు, కరీంనగర్ జిల్లాల ప్రాంతీయ కథల్ని కూడా పరామర్శిస్తూ, పి.యశోదారెడ్డి, నాగప్పగారి సుందరరాజు, గూడూరి సీతారాం వంటివారి కథల్లోని ప్రాంతీయ అస్తిత్వాల్ని పట్టిచూపే ప్రయత్నాలు ఉన్నాయి. కె.శ్రీనివాస్, ‘ఏకత్వం భిన్నత్వం: తెలుగు కథ’, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ‘ప్రాంతీయతే జీవధాతువు’, స్వామి ‘అవధుల్లేని ప్రాంతీయ అస్తిత్వాలు’ ఇత్యాది వ్యాసాలు అమూల్యమైనవి. తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం దాని చుట్టూ వున్న చైతన్య, తాత్త్వికతల మీద ఈ పుస్తకం విలువైన విశ్లేషణ చేస్తుంది. ఇందులోని వ్యాస రచయితలు ఒక్కో ప్రాంతపు కథను 10-15 సంవత్సరాల కాలవ్యవధుల్లో పరిశీలిస్తూ ఎంతో లోతైన చర్చను చేశారు. ఒకే ప్రాంతంలోని ప్రాంతీయ వస్తు రూపాలు నిర్దిష్ట కాల పరిమితుల్లో ఎట్లా పరిణామశీలతను పొందాయో, లేదూ గిడసబారి పోయాయో వివరించాయి. ఆశ్చర్యంగా ప్రాంతీయ అస్తిత్వపు వింగడింపు కిందకి రాని కోస్తా కథను కూడా ఆ దృష్టితో చూడడానికి ఈ పుస్తకంలో ఒక ప్రయత్నముంది. ఆ దృష్ట్యా వాసిరెడ్డి నవీన్ వ్యాసం విలువైంది. సంస్కార ఉద్యమాల ప్రతిఫలంగా సంస్కరణ వాద కథాంశాల తల్లిగా భావించే ఉత్తరాంధ్రలోని ప్రాంతీయ విశిష్టతల్ని అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, కోస్తాంధ్ర ప్రాంతపు అంచుల్లో సూక్ష్మదృష్టికి అగుపడే అస్తిత్వ వేదనల్ని కాట్రగడ్డ దయానంద్ వ్యాసాలు వివరిస్తాయి. జి.వెంకటకృష్ణ తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం; సంపాదకులు: వెల్దండి శ్రీధర్ పేజీలు: 384; వెల: 300; ప్రతులకు: సంపాదకుడు, 303, కేపీఎస్ గ్రాండ్ అపార్ట్మెంట్, ఏ క్యాంప్, చాణక్యపురి కాలనీ, కర్నూల్; ఫోన్: 9866977741