నేడు సిల్వర్‌జూబ్లీ కాలేజీ ‘రీయూనియన్ ఫెస్ట్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల సూపర్ సీనియర్స్ (1972- 75 మొదటి బ్యాచ్) ‘రీయూనియన్ ఫెస్ట్’ ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ‘సూపర్ సీనియర్స్’ పట్టభద్రులై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన 120 మంది పూర్వవిద్యార్థుల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమాపతి (ఐపీఎస్), ఇద్దరు రిటైర్డు ఐఏఎస్ అధికారులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కీలకస్థానాల్లో ఉన్న హేమాహేమీలు ఎందరో ఉన్నారు.
సుదీర్ఘకాలం తర్వాత మిత్రులతో కలిసేందుకు...
40 ఏళ్ల కిందట కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో కలిసి చదువుకున్న మిత్రులందరినీ సమావేశపరచాలని, వారి కుటుంబాలతో అనుభూతులు పంచుకోవాలని ఐవైఆర్ కృష్ణారావు యోచించి పలువురితో సంప్రదించారు. ఈ ఉత్సవానికి హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని సెంట్రల్ పార్కు హోటల్‌ను వేదికగా ఆదివారం ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ ఫెస్ట్‌కు సూపర్ సీనియర్స్‌తోపాటు వీరికి బోధించిన అధ్యాపకులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవానికి కళాశాల మొదటి బ్యాచ్ వారు మాత్రమే కుటుంబాలతో హాజరుకావాలని కోరారు. రిజిస్ట్రేషన్ వీరికి మాత్రమే పరిమితమని నిర్వాహకులు వైఎస్ మూర్తి (ఫోన్ నంబరు-9885222825), ఆర్‌ఎస్ లక్ష్మణ్ (ఫోన్ నంబరు-9391007309) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.